తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10వ దఫా చర్చలూ అసంపూర్తిగానే.. 22న మరోసారి భేటీ - కనీస మద్దతు ధర

Centre farmer talks
రైతులు, కేంద్రం మధ్య ప్రారంభమైన పదో దఫా చర్చలు

By

Published : Jan 20, 2021, 1:47 PM IST

Updated : Jan 20, 2021, 7:36 PM IST

19:26 January 20

ఈసారీ అసంపూర్తిగానే..

సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పదో దఫా చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు చేసింది కేంద్రం. తొలుత సాగు చట్టాలను ఏడాది పాటు వాయిదా వేస్తామని ప్రతిపాదించగా అందుకు రైతులు నిరాకరించారు. ఆ తర్వాత రెండేళ్లకు పెంచింది కేంద్రం. అయినప్పటికీ రైతుల నుంచి సానుకూలత రాకపోవటంతో కమిటీ వేసి.. నివేదిక వచ్చే వరకూ వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని ప్రతిపాదించింది. దీనిపై అందరం చర్చించుకుని తుదినిర్ణయం వెల్లడిస్తామని రైతులు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి చర్చలను ఈనెల 22కు వాయిదా వేశారు. 

కేంద్రం ప్రతిపాదనపై చర్చించేందుకు గురువారం (జనవరి 21న) భేటీ కానున్నారు రైతులు.  

19:18 January 20

కమిటీ నివేదిక వచ్చే వరకు సాగు చట్టాల నిలిపివేత!

  • రైతుల ముందు కేంద్ర ప్రభుత్వం మరో తాజా ప్రతిపాదన.
  • కాలపరిమితి లేకుండా కమిటీ నివేదిక వచ్చే వరకు మూడు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని ప్రతిపాదన.
  • దీనిపై రైతులు తమ నిర్ణయం చెప్పాలన్న ప్రభుత్వం.
  • అందరం చర్చించుకుని తుదినిర్ణయం వెల్లడిస్తామన్న రైతులు..

19:04 January 20

2 సంవత్సరాల పాటు చట్టాల నిలిపివేతకు కేంద్రం ప్రతిపాదన

  • రైతుల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన
  • రెండు సంవత్సరాలపాటు చట్టాలను నిలిపివేస్తామని ప్రతిపాదన.
  • కమిటి ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపాదన.
  • రైతులు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం

18:25 January 20

చట్టాల సవరణకు కేంద్రం ప్రతిపాదన.. రైతుల తిరస్కరణ

  • వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామని మరోసారి ప్రతిపాదించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
  • మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన రైతు సంఘాల ప్రతినిధులు.
  • ఒక సంవత్సరం పాటు చట్టాన్ని నిలిపివేస్తామని, కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రతిపాదన.
  • టీ విరామంలో ఈ ప్రతిపాదనను పరిశీలించాలని రైతులను కోరిన ప్రభుత్వం.
  • కమిటీ ఒక సంవత్సరానికి మించి సమయం తీసుకుంటే, చట్టాన్ని సంవత్సరానికి మించి నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన.
  • ఏడాది పాటు చట్టాలు నిలిపివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు

17:58 January 20

సవరణలు వద్దు...

రైతులతో బుధవారం జరిగిన 10వ దఫా చర్చల్లో.. మూడు సాగు చట్టాలను సవరించేందుకు ప్రతిపాదించింది కేంద్రం. అయితే ఈ ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేసుకోవాలన్నదే తమ డిమాండ్​ అని తేల్చిచెప్పారు. 

మరోవైపు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై జరపాల్సిన చర్చను కేంద్రం కావాలనే పక్కనపెడుతోందని మండిపడ్డారు రైతన్నలు.

14:53 January 20

రైతులు, కేంద్రం మధ్య ప్రారంభమైన పదో దఫా చర్చలు

నూతన సాగు చట్టాలపై రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య పదో విడత చర్చలు దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో ప్రారంభమయ్యాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్​ తోమర్​, పీయూష్​ గోయల్​లు హాజరయ్యారు. 

14:15 January 20

ఢిల్లీ విజ్ఞాన్  భవన్ చేరుకున్న రైతు సంఘాల ప్రతినిధులు..

నేడు రెండు అంశాల పై కేంద్రంతో చర్చలు జరుగనున్నాయి: రైతులు

వ్యవసాయ చట్టాల రద్దు, ఎంఎస్పి కి చట్టబద్దత పై కల్పించాలనేది మా డిమాండ్: రైతులు

కమిటీ లో ఎవరున్నారనేది పక్కన పెడితే.. సుప్రీంకోర్టు వేసిన కమిటీ ముందుకు వెళ్లేదేలేదు అని ముందే చెప్పాము: రైతులు

ఇక్కడ కేంద్రానికి రైతులకు మధ్య చర్చలు: రైతులు

భారత పౌరులుగా మా హక్కు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాము.- కవిత కురగంటి, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు.

13:58 January 20

విజ్ఞాన్​భవన్​కు రైతులు..

కేంద్రంతో చర్చల కోసం.. రైతులు దిల్లీ విజ్ఞాన్​ భవన్​కు చేరుకున్నారు. సాగు చట్టాలపై పరిష్కారం కోసం.. ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులతో పదో విడత చర్చలు జరపనుంది కేంద్రం. చట్టాల రద్దు తప్ప మరో అంశంపై చర్చించేది లేదని చెబుతున్న రైతు సంఘాలు అన్నదాతలకు మద్దతిచ్చే వారిపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. 

హరియాణాలో 900 కేసుల నమోదుపై రైతుసంఘాలు నిరసన తెలిపాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందుకు వెళ్లబోమన్న రైతులు విధాన నిర్ణయం తీసుకునే అంశం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. చట్టాల రద్దుపై కమిటీ వేయాలని సుప్రీంకోర్టును తాము కోరలేదన్న రైతులు చట్టాల రద్దుపై ప్రభుత్వంతో మాత్రమే చర్చిస్తామన్నారు. మరోవైపు సాగు చట్టాలపై అభ్యంతరాలు చెప్పాలని ఈ నెల 15 నాటి చర్చల్లో కేంద్రం కోరినప్పటికీ చట్టాల రద్దే తమ అజెండా అని అన్నదాతలు చెబుతున్నారు.

చర్చలకు ముందు మీడియాతో మాట్లాడారు భారతీయ కిసాన్​ సంఘం ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధరపై చట్టం చేసి.. మిగతా సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్​ వ్యవస్థలకు వ్యతిరేకంగానే తమ నిరసనలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 3 వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాల్సిందేనని అన్నారు. 

13:42 January 20

కేంద్రం, రైతుల మధ్య 10వ దఫా చర్చలు

  • మరికాసేపట్లో రైతు సంఘాల నేతలతో భేటీ కానున్న కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్
  • భేటీకి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన నరేంద్ర సింగ్ తోమర్
  • చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న రైతులు
  • ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై ఇరువురు మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం
Last Updated : Jan 20, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details