తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాకొద్దీ పద్మశ్రీ అవార్డు... అన్నదాత దీనగాధ..! - Padmasree

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ రైతు... తన గ్రామంలోని పంటపొలాలకు సరైన కాలువ వసతి లేక తోటి రైతులందరూ కష్టాలుపడుతుంటే చలించాడు. కుటుంబసభ్యుల సాయంతో మూడు కిలోమీటర్ల మేర కాలువ తవ్వి నీరందించాడు. కానీ ఇప్పుడు ఆ రైతుకే ఉపాధి కరవైంది. ఆయన కష్టానికి మెచ్చి ప్రభుత్వం సత్కరించిన పద్మశ్రీ అవార్డే ఇప్పుడు ఈ దుస్థితికి కారణమైందంటున్నాడు ఆ అన్నదాత.

నాకొద్దీ పద్మశ్రీ అవార్డు... అన్నదాత దీనగాధ..!

By

Published : Jun 25, 2019, 6:03 PM IST

ఒడిశాలోని కెనోజర్​ జిల్లా తాలబైతరిణి గ్రామానికి చెందిన ఓ చిన్న రైతు దైతారీ నాయక్‌(75). ఊరంతా కరవుతో అల్లాడిపోతుంటే చూడలేక కొండలు, గుట్టల మధ్య నుంచి కుటుంబసభ్యుల సాయంతో మూడు కిలోమీటర్ల మేర కాలువ తవ్వి పంట భూముల గొంతు తడిపాడు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆ సత్కారమే ప్రస్తుత తన దుస్థితికి కారణం అంటున్నారు దైతారీ. కానీ, ఇప్పుడు ఆ రైతన్నకే ఉపాధి కరవైంది.

" ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం నాకు ఏవిధంగా సాయపడలేదు. గతంలో నేను దినసరి కూలీగా పనిచేసేవాడిని. అవార్డు వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరూ పనికి పిలవట్లేదు. ప్రభుత్వం నిన్ను గొప్ప వ్యక్తిని చేసింది. ఇప్పుడు మేం నిన్ను పనికి పిలిస్తే నీ గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందంటున్నారు. ఫలితంగా ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టమైపోయింది. బీడీ ఆకులు, అప్పడాలు అమ్ముకుంటున్నాం. అవార్డుతో గ్రామంలో నాకున్న విలువ తగ్గిపోయింది. అందుకే నేను పురస్కారాన్ని తిరిగిచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడైనా నాకు పని దొరుకుంతుందేమో."
- దైతారీ, రైతు (పద్మశ్రీ అవార్డు గ్రహీత)

ప్రస్తుతం దైతారీ తన స్వగ్రామంలో ఓ చిన్న పూరి గుడిసెలో నివాసముంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇందిరా ఆవాస్‌ యోజన కింద ఇల్లు మంజూరైనా.. డబ్బులేక ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆయన కుమారుడు అలేఖ్‌ కూడా దినసరి కూలీగానే పనిచేస్తున్నారు. ‘‘అవార్డు అందుకున్న సందర్భంగా తన తండ్రికి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని... అయితే అవేవీ నెరవేర్చలేదన్నారు అలేఖ్​.

దైతారీ దుస్థితిపై ఆ జిల్లా పాలనాధికారి ఆశిశ్‌ ఠాక్రే స్పందించారు. ఆ పేద రైతుకి వచ్చిన సమస్యలేంటో తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details