లాక్డౌన్ వేళ మీరేం చేశారు అనే ప్రశ్న ఎదురైతే మీ సమాధానం.. ' కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నాం. ఎక్కువగా టీవీ, మొబైళ్ల ముందు సమయం గడిపాం' అనే జవాబిస్తారు కదూ. అయితే కొందరు మాత్రం తమ అభిరుచికి తగిన విధంగా జీవించడమే కాదు.. సామర్థ్యాన్నీ నిరూపించుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన గోపాల్ ఉప్రేతీ రికార్డులు తిరగరాసేలా పంట సాగు చేశాడు. ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
ఉత్తరాఖండ్ అల్మోడాలోని విల్లేఖ్ నివాసి గోపాల్ ఉప్రేతీ.. దిల్లీలో వ్యాపారం నిర్వహిస్తుంటాడు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లిపోయిన అతడు.. తన యాపిల్తోటలో ఖాళీ స్థలాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కొత్తిమీర, వెల్లుల్లి, పాలకూర పంటలు వేశాడు. ఉప్రేతీ వేసిన కొత్తిమీర పంట ఏకంగా ఆరు అడుగుల వరకు పెరిగింది.
రికార్డుల్లో చోటు ఇలా..
రైతు ఇచ్చిన సమాచారం మేరకు పంటను పరిశీలించేందుకు వచ్చిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు.. కొత్తిమీర మొక్కలు 6.1 అడుగుల ఎత్తు వరకు పెరిగాయని నిర్ధరించారు. అంతకుముందు ఉన్న 5 అడుగుల 11 అడుగుల రికార్డును ఉప్రేతీ పంట తిరగరాసిందని చెప్పి.. కొత్త రికార్డు నమోదు చేశారు.