ఒడిశాలో ఫొని తుపాను భారీ విధ్వంసం సృష్టించిందని కేంద్రానికి నివేదించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తుపాను ప్రభావం, నష్టంపై... ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, బంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేంద్ర విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) దూరదృశ్య సమీక్ష నిర్వహించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రాల్లో వాటిల్లిన నష్టంపై వివరాలు సేకరించింది కమిటీ.
ఒడిశాలో భారీ స్థాయిలో విరుచుకుపడిన ఫొనితో విద్యుత్, టెలికం వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అయితే పూరీ, భువనేశ్వర్ వంటి పట్టణాలలో టెలికం సేవలను ఇప్పటికే తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు.
ఒడిశా రాష్ట్ర అభ్యర్థనల నేపథ్యంలో సేవల పునరుద్ధరణకు సంబంధించి విద్యుత్, టెలికం శాఖలకు కీలక ఆదేశాలిచ్చారు పీకే సిన్హా. విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు స్తంభాలు, డీజిల్ జనరేటర్లు, సిబ్బందిని సత్వరమే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. భువనేశ్వర్‌లో నేటి రాత్రికల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
ప్రారంభమైన విమానాలు, రైలు
తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో రద్దయిన రైలు, విమాన సేవలను నేడు పునరుద్ధరించారు. ప్రధాన మార్గాన్ని సిద్ధం చేసిన రైల్వే.. డీజిల్ ఆధారిత రైళ్లను ప్రారంభించింది. భువనేశ్వర్‌కు విమాన సేవలను మధ్యాహ్నం పునరుద్ధరించారు.