తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సార్వత్రిక సమరం: జోరుగా తొలిదశ పోలింగ్​ - అసెంబ్లీ

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 91 లోక్​సభ నియోజకవర్గాలతో పాటు... 4 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఈసీ.. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసింది. వేకువజాము నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు.

2019 ఎన్నికలు

By

Published : Apr 11, 2019, 9:01 AM IST

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్​ మొదలైంది. అన్ని ఓటింగ్​ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు. ఉదయం 7 గంటలకు ముందు నుంచే జనం లైన్లలో బారులుదీరారు. ఎన్నికల సమగ్ర నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎప్పటికప్పుడు పోలింగ్​ సరళిపై అంచనా వేసి.. ఓటింగ్​ శాతాన్ని వెల్లడించనుంది.

2019 సార్వత్రిక ఎన్నికల కోసం బారులు తీరిన ప్రజలు

తొలి దశలో భాగంగా 91 లోక్​సభ స్థానాలతో పాటు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగియనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్​ 4 గంటల వరకే జరగనుంది.

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు.

''ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్​ శాతం పెంపునకు కృషి చేయాలి. ముఖ్యంగా తొలిసారి ఓటర్లు భారీగా తరలిరావాలి.''

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఆర్​ఎస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ నాగ్​పుర్​ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు మన బాధ్యత అని.. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

మహారాష్ట్ర గడ్చిరోలి, జమ్ముకశ్మీర్​ పుంఛ్​ లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ప్రశాంత వాతావరణం నడుమ ఓటింగ్​ జరుగుతోంది.

ఓటర్లకు ప్రత్యేక ఆహ్వానం....

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో ఓటింగ్​ సజావుగా జరుగుతోంది. బాగ్​పత్​ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించడానికి ఈసీ వినూత్న ప్రయత్నం చేసింది. బడౌత్​ నియోజకవర్గంలో పోలింగ్​ బూత్​కు వచ్చే ఓటర్లపై పూలు జల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు సిబ్బంది.

ఈశాన్య భారతాన....

తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శాసనసభ పోలింగ్​ నాలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది. అరుణాచల్​ ప్రదేశ్​, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్​లో ఏకకాలంలో లోక్​సభతో పాటు.. అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతున్నాయి.

మేఘాలయలో పోలింగ్​ ఇప్పుడే పుంజుకుంటోంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పోలింగ్​ కేంద్రంలో మొదట ఓటేసిన ఐదుగురిని ఎన్నికల సంఘం మెడల్స్​తో సత్కరించింది.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి వృద్ధులూ ఉత్సాహంగా వస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, పోలింగ్​ కేంద్రాలకు చేరుకోలేని వారి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ABOUT THE AUTHOR

...view details