దిల్లీలో 2018 జులైలో సంచలనం సృష్టించిన బురారీ హౌస్ సామూహిక ఆత్మహత్యల ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా మోహన్ సింగ్ కశ్యప్ అనే వైద్యుడు ఈ భవనాన్నే తన నివాసంగా మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ భవనం మరోసారి వార్తల్లోకెక్కింది.
పలు రకాల పూజలు, యజ్ఞాలు నిర్వహించి తన కుటుంబంతో సహా ఈ భవనంలోకి వచ్చారు మోహన్. తొలి అంతస్తులో కుటుంబాన్ని ఉంచి కింది అంతస్తులో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. మూఢనమ్మకాలను విశ్వసించనని ఆయన చెబుతున్నారు.
"ఈ విషయాలన్నీ నాకు తెలుసు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఇక్కడ దగ్గర్లోనే ఉండేవాడిని. నాకు స్థలం కావాలి. ఇది రహదారికి దగ్గరగా ఉన్నందున సౌకర్యంగా ఉంటుంది. రోగులకు కూడా తెలిసిన ప్రాంతం ఇది. ఇంతకుముందు ఎవరు ఉన్నారనే విషయం నాకు అనవసరం. నాకు నచ్చింది. ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకోవడానికి ఎలాంటి ఇబ్బందిలేదని రోగులు కూడా నాతో చెప్పారు. అలాంటి మూఢనమ్మకాలను విశ్వసిస్తే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు."
-మోహన్ సింగ్ కశ్యప్
అయితే భవనంలోకి వచ్చే ముందు పూజారి ద్వారా వివిధ ప్రార్థనలు జరిపించారు కశ్యప్.
"ఇక్కడ గౌరీ-గణేష్ పూజ చేశాము. ఆ తర్వాత యజ్ఞం నిర్వహించాము. నాకు ఇప్పుడే తెలిసింది. ఈ భవనం గురించి అంతకుముందు తెలియదు. నా అభిప్రాయం ప్రకారం ఇవన్నీ అంధవిశ్వాసాలు. వీటిపై దృష్టి పెట్టనవసరం లేదు."
-పూజారి.