తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భావవ్యక్తీకరణకు అసలైన అర్థం చెప్పిన బాపూజీ - అసలైన అర్థం

ఏ ఉద్యమానికైనా భావవ్యక్తీకరణే శక్తిమంతమైన ఆయుధం. నాయకులు చెప్పే మాటలు, చేసే ప్రసంగాలే ప్రజల పోరాట పంథాను నిర్దేశిస్తాయి. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల్లో విద్వేషమే రాజ్యమేలుతోంది. నాయకులు తమ ప్రసంగాలతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ప్రజల్ని ఆవేశపరులుగా మార్చుతున్నారు. అయితే 'కేవలం మాటలే కాదు.. మౌనమూ ఓ శక్తిమంతమైన భావవ్యక్తీకరణే' అని అప్పట్లోనే ప్రపంచానికి చాటారు మహాత్మాగాంధీ. ఇవే ప్రజల్ని అహింసా పోరాటం వైపు నడిచేలా చేశాయి.

భావవ్యక్తీకరణకు అసలైన అర్థం చెప్పిన బాపూజీ

By

Published : Sep 2, 2019, 7:01 AM IST

Updated : Sep 29, 2019, 3:28 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల్లో విద్వేషమే రాజ్యమేలుతోంది. అయితే.. హింస ప్రజ్వరిల్లాలేగానీ.. ఇలాంటి ఉద్యమాలు ఉక్కుపాదాల అణచివేతతో ముగిసిపోతాయి. ఉద్యమంలో భావవ్యక్తీకరణ కత్తిమీద సాములాంటిది. ఏ మాత్రం పట్టుతప్పినా సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతుంది.

గాంధీజీ తన ప్రసంగాలతో ప్రజలను ఆలోచనపరుల్ని చేశారు. ఏ పంథాలో సాగాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించారు. కేవలం మాటలే కాదు.. మౌనమూ ఓ శక్తిమంతమైన భావవ్యక్తీకరణే అని మహాత్ముడు ప్రపంచానికి చాటారు. నిరాహార దీక్షలు, మౌనంతో... తన నిశ్శబ్దాన్ని సైతం.. ఆంగ్లేయులు భరించలేని స్థితి కల్పించారు.

అవసరమైనప్పుడు మాటలతో, అవసరం లేనప్పుడు మౌనంతో బ్రిటిషర్ల మెడలు వంచారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. ఉద్యమాలు చేసే నేటితరం నాయకులకు గాంధీజీ భావవ్యక్తీకరణ ఓ విలువైన పాఠం.

మహాత్ముడి శాంతిమంత్రం...

విద్వేషపూరిత ప్రసంగాలు, హింస.. ప్రజల్ని విభజిస్తాయి. భయాన్ని సృష్టిస్తాయి. సమాజాన్ని భయకంపితులను చేస్తాయి. ఈ విద్వేషపూరిత ప్రసంగాల వల్ల ప్రజలు హింస వైపు ఆకర్షితులవుతారు. విద్వేషం మొదట తన బలాన్ని చూపించవచ్చు. కానీ.. చివరకు గెలిచేది శాంతి మాత్రమే.

తనపై విమర్శలు చేసే వారిపై మహాత్ముడు శాంతిమంత్రమే జపించారు. ప్రజల ఆలోచనలు మార్చారు. విద్వేషాలు, విభజనలు లేని సమసమాజం ఏర్పడాలంటే.. గాంధేయ భావవ్యక్తీకరణ తప్పనిసరి. తన సిద్ధాంతాలతో స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడు.. భావవ్యక్తీకరణ సరిహద్దులను చెరిపేశారు. తన ఉద్దేశాలను చెప్పేందుకు.. గాంధీజీకి పదాలే అవసరం లేదు. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు గల దేశంలో.. ప్రజల్ని ఏకం చేసేందుకు భాషే సరైన సాధనమని గాంధీ భావించారు.

"నాయకత్వమంటే భౌతికమైన బలమని ఒకప్పుడు నేనూ అనుకున్నాను. కానీ.. ప్రజలతో మమేకం కావడమే నిజమైన నాయకత్వం.

- మహాత్మాగాంధీ

నైతిక విలువల్నే ప్రసంగాల్లో చెప్పి...

బాపూజీ మంచి వక్త కాదు. నిజాయతీ గల రచయిత. నిరాడంబరమైన జీవనం, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, ఏ పరిస్థితిలోనైనా వీడని ప్రశాంతత వల్లే.. గాంధీజీ మాటలకు క్రమంగా పదును పెరిగింది. గాంధీ ఎప్పుడూ తాను నమ్మని, పాటించని పద్ధతులపై మాట్లాడలేదు. నైతిక విలువలను పాటించడంలో ఎప్పుడూ ముందుండేవారు. వాటినే రచనల ద్వారా, ప్రసంగాల్లో చెప్పి.. స్వతంత్ర సంగ్రామంలో ప్రజల్ని ఒక్కటి చేశారు. గాంధీ స్వతహాగా సిగ్గరి. కానీ.. అదే తన ఆస్తి అని నమ్మారు. దూరదృష్టి గల బాపూజీ ప్రసంగాలు ప్రజలను అహింసా పోరాటం వైపు నడిపించాయి.

"ఒకప్పుడు సంకోచం వల్ల.. ప్రసంగించేటప్పుడు కోపం వచ్చేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ప్రయోజనం కలిగింది. ఇప్పుడు నేను ధారాళంగా ప్రసంగించగలుగుతున్నాను.''

-మహాత్మాగాంధీ

అణగారిన వర్గాలకు గాంధీజీ గొంతుక అయ్యారు. నాయకత్వ లక్షణాలు, సత్యాగ్రహ రచనలతో.. అహింసా ప్రసంగాలతో స్వతంత్ర సంగ్రామ ఆకాంక్షను రగిలించారు. అనుచరుల ఆవేశాన్ని తన నైతికత ద్వారా చల్లార్చేవారు. పోరాట పంథా ఎలా ఉండాలో అవగాహన కల్పించేవారు. సమర్థవంతమైన తన భావవ్యక్తీకరణతో ఉద్యమాన్ని దశదిశలా వ్యాపించేలా చేశారు.

మౌనమే ఆయుధంగా పోరాటం...

నూలు ఒడికి, ఖాదీ ధరించి, బక్కపల్చని దేహంతో, నిరాడంబర జీవితంతో... ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీజీ నాటి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించడానికి ఎవరైనా ముందే సాధన చేస్తారు. కానీ.. ప్రజల బాధలు తెలిసిన గాంధీకి ఆ అవసరం లేకపోయింది.

ఉద్యమ రథసారథిగా అనుచరులను, ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఉర్రూతలూగించే ప్రసంగాలు గాంధీ ఎప్పుడూ చేయలేదు. మౌనం, నిరాహార దీక్షలతో చడీచప్పుడు లేని యుద్ధం చేసిన గాంధీ.. శత్రువుల గుండెల్లో ప్రకంపనలు సృష్టించారు.

బలహీనుడిలానే కనిపించినా....

శరీరాన్ని పూర్తిగా కప్పని, చాలీచాలని ఖాదీ వస్త్రంతో కనిపించే మహాత్ముడు ఏనాడూ ఓ నాయకుడిగా కనిపించరు. సరళమైన ఆయన జీవన విధానం చూస్తే మహాత్ముడి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. బయట నుంచి చూస్తే.. గాంధీజీ బలహీనుడుగానే కనిపిస్తారు. అంతర్‌దృష్టితో చూస్తే కానీ.. ఆయన ఎంతటి బలవంతులో అర్థం కాదు.

అహింసా, సత్యాన్నే తన ఆయుధాలుగా ధరించిన బాపూజీ.. తన పంథాపై గుండెల నిండా నమ్మకంతో పోరాడారు. చలించని వైఖరితో స్పష్టమైన దృక్పథంతో ఉద్యమాన్ని నడిపించారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారు.

గాంధీజీ ప్రసంగాలు ఆకట్టుకోవు. ఎందుకంటే.. ఆయన మంచి వక్త కాదు. నిజాయతీ, మౌనాన్నే ఆకర్షణగా అందరినీ ఒక్కటి చేశారు. తనకోసం వచ్చే వేలాదిమంది ప్రజలు, వారి ఆశలు, అంతులేని పట్టుదలే.. గాంధీజీ శక్తి సామర్థ్యాలను తెలుపుతాయి. మహాత్ముడు స్వాతంత్ర్య సమరంలో పాల్గొనే సమయానికి.. ఆయుధమే మాట్లాడింది. ఎక్కడ చూసినా హింసే. అహింసనే ఆయుధంగా చేసుకున్న గాంధీజీ.. నిశ్శబ్ద యుద్ధం చేశారు. తాను చేసే ప్రతి పోరాట ప్రకటన... ఆంగ్లేయుల గుండెల్లో ప్రతిధ్వనించింది.

మౌనమూ.. మాట్లాడటమూ భావవ్యక్తీకరణే..

సత్యాగ్రహ పోరాటంతో.. గాంధీజీ అందరి మన్ననలు పొందారు. భావవ్యక్తీకరణ అంటే.. పదాలు, ప్రాసలతో అవగాహన కల్పించడం కాదు. మౌనంతో మాట్లాడటమూ.. భావవ్యక్తీకరణే అని గాంధీజీ నిరూపించారు.

''ఆలోచనలు పదాలుగా బయటకు వస్తాయి. ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మాటలు ప్రవర్తన అవుతుంది. పదాలను సానుకూలంగా ఉంచండి. ప్రవర్తన అలవాటుగా మారుతుంది. ప్రవర్తనను సానుకూలంగా ఉంచండి. అలవాట్లు విలువలవుతాయి. అలవాట్లను సానుకూలంగా ఉంచండి. విలువలు మన విధి అవుతుంది. మీ విలువలను సానుకూలంగా ఉంచండి.''

-ఇదే గాంధీ తన భావవ్యక్తీకరణ ద్వారా మనకు ఇచ్చిన సందేశం.

(రచయిత- డా. చల్లా కృష్ణవీర్​ అభిషేక్​)

ఇదీ చూడండి : ఎన్​ఆర్​సీలో లేకున్నా వారినలా చూడొద్దు: ఐరాస

Last Updated : Sep 29, 2019, 3:28 AM IST

ABOUT THE AUTHOR

...view details