కల్లోలం రేపుతున్న కరోనాను కట్టడి చేయాలంటే అధిక సంఖ్యలో పరీక్షలు చేయడం కీలకం. ప్రపంచంలోని అన్ని దేశాలూ లక్షల కొద్దీ ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను తయారు చేయిస్తున్నాయి.. దిగుమతి చేసుకుంటున్నాయి. బయోటెక్, పరిశోధన సంస్థలు వాటి తయారీలో తలమునకలుగా ఉన్నాయి. మన దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర పరీక్ష పరికరాలపై ప్రస్తుతం దృష్టి సారించాయి. ఇతర దేశాల నుంచి భారీ సంఖ్యలో కిట్‌లను దిగుమతి చేసుకుంటున్నాయి.
ఏం తేలుతుంది?
వైరస్ బారిన పడినవారిని, కోలుకున్న వారిని సత్వర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వైరస్ శరీరంపై దాడి చేస్తున్నప్పుడు దానిపై పోరాడేందుకు వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. వేలి నుంచి తీసిన రక్తంతో నిర్వహించే సత్వర పరీక్షలు ఈ యాంటీబాడీలను గుర్తిస్తాయి. ఓ వ్యక్తి శరీరంలో ఇవి ఉంటే అప్పటికే అతనికి వైరస్ సోకిందని భావిస్తారు.
ఇదీ విధానం
కిట్‌లలో ఐజీజీ, ఐజీఎం అనే రెండు రకాల పట్టీలుంటాయి. ప్రజల నుంచి తీసిన రక్త నమూనాలను ఈ పట్టీలపై పూసి పరీక్షిసారు. శరీరంలో వైరస్ ఉన్నదీ లేనిదీ 10-15 నిమిషాల వ్యవధిలో తెలుస్తుంది. పాజిటివ్ వస్తే తుది నిర్ధరణకు ఆ నమూనాను వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు
భిన్న వాదనలు
*కొందరు శాస్త్రవేత్తలు ఈ కిట్‌లను వ్యాధినిరోధక శక్తి గుర్తింపు పత్రాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ విధానం ఎంతో చౌకయింది.. నమ్మశక్యం కానంత విస్తృత సమాచారాన్ని అందిస్తుంది.. అని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిపుణుడు ఒకరు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో వైద్య, ఆరోగ్య నిపుణులు ఈ విధానంపై విశ్వాసం వెలిబుచ్చారు. ఈ క్రమంలో కొనుగోళ్లు విపరీతంగా సాగుతున్నాయి. అయితే ఈ కిట్‌లు అనుమానితుల్లో వైరస్‌ను గుర్తించడంలో పూర్తిస్థాయి సామర్థ్యం కలిగి ఉన్నాయా అనేది అనుమానమేనన్నది కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే ఈ పరీక్షల్లో 'పాజిటివ్' అని వస్తే వారికి కరోనా సోకిందని దాదాపుగా చెప్పెయ్యొచ్చు. కానీ పరీక్షల్లో 'నెగెటివ్' వచ్చినంత మాత్రాన కరోనా లేదని కచ్చితంగా చెప్పలేం!
* కరోనా వైరస్‌ను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షల్లో సమయం, కచ్చితత్వం.. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ర్యాపిడ్ కిట్ ద్వారా వ్యక్తులకు పరీక్షలు చేసే సమయానికి వారిలో వైరస్‌పై పోరాడే యాంటీబాడీలు తయారై ఉండకపోతే ఈ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తుల్లో వైరస్‌పై పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ స్పందించి యాంటీబాడీల్ని తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయం శాస్త్రవేత్తలకూ అంతుబట్టడం లేదు. ఒకవేళ కొందరిలో ఇతరత్రా వైరస్‌లపై పోరాడేందుకు యాంటీబాడీలు తయారై, అవి పరీక్షల్లో బయటపడితే.. కరోనా పాజిటివ్‌లుగా భావిస్తారని, తద్వారా అనవసర ఆందోళనలు తప్పవన్నది ఒక వాదన.
*వైరస్‌ను కణాల్లోకి చేరనీయకుండా చూసే తటస్థ యాంటీబాడీలను కొందరి శరీరాల్లో వ్యాధినిరోధక వ్యవస్థలు తయారు చేస్తాయి. ఈ తీరు అందరిలోనూ ఒకేలా ఉండదు. సత్వర యాంటీబాడీ పరీక్షలు ఇలాంటి వారి విషయంలో స్పష్టమైన ఫలితాల్ని చూపలేవన్నది మరో వాదన.
ఇంగ్లాండ్‌లో తీవ్ర విమర్శలు
యాంటీబాడీ పరీక్ష విధానం ప్రస్తుత పరిస్థితిని సమూలంగా మార్చేయగలిగే సాధనమని ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గతంలో కొనియాడారు. తమ దేశం కోసం 17.5 కోట్ల కిట్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మార్చి నెలలో లక్షల కొద్దీ పరీక్షలు చేపట్టారు. ఇవేవీ స్పష్టమైన ఫలితాల్ని ఇవ్వలేదని, ఈ విధానమే నిష్ఫలమని కొందరు వైద్యనిపుణులు వ్యాఖ్యానించారు. ఈ పరీక్షల కిట్‌ల ఉదంతంపై ఆ దేశంలో తీవ్ర విమర్శలు చెలరేగాయి.
'కిట్‌లు' ప్రత్యామ్నాయం కాదు: ఐసీఎంఆర్
కరోనా వైరస్‌ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న పీసీఆర్ ఆధారిత మాలిక్యులర్ పరీక్షలే చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్పష్టంచేసింది. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు వీటికి ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పింది. ఓ నిర్దేశిత ప్రదేశంలో వైరస్ పెరుగుతోందా? లేదా? సాధారణ జనాభాలో వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తీరు ఎలా ఉంటోందన్నది గుర్తించేందుకు, అది ప్రబలుతున్న తీరును అంచనా వేయడానికి 'ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్' ఓ అనుబంధ సాధనం మాత్రమేనని, వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి 7 రోజుల తర్వాత పరీక్షలు చేసేందుకు ఈ కిట్‌లను వాడాలని పేర్కొంది. అంటువ్యాధులపై అధ్యయనాలకు, వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు ఈ సత్వర యాంటీబాడీ పరీక్షలు ఉపయోగకరమని, వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే వీటిని నిర్వహించాలని చెప్పింది.
ఇదీ చదవండి:దేశంలో 24 గంటల్లో 1553 కరోనా కేసులు