ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న రామ మందిర భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత ఉమా భారతి పేర్కొన్నారు. రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి నిర్ణయించిన ముహూర్తంపై వస్తున్న భిన్న వాదనల్ని కొట్టిపారేశారు.
రాముడికి సంబంధించిన ప్రతి అంశం పవిత్రమైనదని, ఈ కార్యక్రమాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు ఉమ. తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నా, లేకపోయినా.. రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ముఖ్యమని పేర్కొన్నారు.
ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఉమా భారతి... ఐదు శతాబ్దాల పోరాటానికి ఫలితం దక్కడం చాలా గర్వకారణమన్నారు. మందిరం నిర్మించాలన్న సుప్రీం తీర్పును అందరూ స్వాగతించారని గుర్తు చేశారు. భాజపాకే కాకుండా ఆలయ నిర్మాణానికి మద్దతిచ్చినవారందరికీ ఇది ముఖ్యమైన సందర్భమని చెప్పారు.
'బాబ్రీ విషయంలో కట్టుబడే ఉన్నా'
బాబ్రీ ఘటనలో తన హస్తం ఉందని ఉమా భారతి బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఈ కేసులో ఉమా భారతి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు అయోధ్యలోనే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు ఉమా భారతి. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు.