దయనీయం: వీర సైనికుడి 'ఓటమి' గాథ బిహార్ గయకు చెందిన సీఆర్పీఎఫ్ మాజీ జవాను నరేంద్ర సింగ్ 17 సంవత్సరాలు దేశానికి సేవలందించారు. 22 ఏళ్ల క్రితం మావోల కాల్పుల్లో అర చేతిని కోల్పోయారు. తనను ఆదుకోవాలని, లేకపోతే యూథనేజియాకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.
"1997లో నన్ను నాగాలాండ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌కు పంపారు. ఆగస్ట్ 15న మావోలు మా క్యాంప్‌పై దాడి చేశారు. నాకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా నేను పోరాడాను. చికిత్స సమయంలో దారుణంగా గాయపడ్డ నా అరచేతిని పూర్తిగా తీసివేశారు. నా కాళ్లకూ గాయాలయ్యాయి. నన్ను కలవడానికి డీజీపీ హాస్పిటల్‌కు వచ్చారు. నా పోరాట స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నారు. నాకు రివార్డుగా పెట్రోల్ పంప్ లేదా, గ్యాస్ ఏజెన్సీ ఇప్పిస్తామని ప్రమాణం చేశారు. 22 ఏళ్లైనా నాకు ఎలాంటి సహాయమూ అందలేదు."
-సీఆర్పీఎఫ్ మాజీ జవాను నరేంద్ర సింగ్
జవాను గుండెకు వరుస తూట్లు..
అరచేతిని కోల్పోయాక సీఆర్పీఎఫ్ నరేంద్ర సింగ్‌ను మోకామా క్యాంపునకు పంపింది. అక్కడే ఆయనకు భార్య చనిపోయిన వార్త తెలిసింది. అదే సమయంలో వైద్యులు... ఆయన జవాను ఉద్యోగానికి పనికి రారని తేల్చిచెప్పారు. పదవీ విరమణే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
మూడేళ్ల తర్వాత ఆయనకు బ్రెయిన్ హెమరేజ్ ఉందని తేలింది. సగానికి మించి మాట పడిపోయింది. చికిత్సకు 15 లక్షలు ఖర్చయింది. ప్రస్తుతం 90 శాతం అంగవైకల్యంతో బతుకీడుస్తున్నారు సింగ్. దాచుకున్న డబ్బంతా పిల్లల చదువులకు సరిపోయింది. ఇప్పుడు పిల్లలందరూ ఆయన్ను ఊర్లో వదిలి ఎక్కడో పట్టణాల్లో బతుకుతున్నారు.
వీర సైనికుడి ఓటమి...
సీఆర్పీఎఫ్ ప్రకటించిన సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆయనకు న్యాయం జరగలేదు. అందుకే 'దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడాను కానీ ఈ ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నాను' అని నిస్సహాయంగా చెబుతున్నారు నరేంద్ర సింగ్. చివరి దశలో ఓపిక నశించి కారుణ్య మరణానికైనా అనుమతించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.