సార్వత్రిక ఎన్నికల రెండో దశ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 95 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు 1629 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం లక్షా 81 వేల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది.
భారీ భద్రత....
పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రాల పోలీసులతో పాటు పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.
తమిళనాట లోక్‌సభతో పాటు శాసనసభకూ..
తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గానూ 38 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. వెల్లూరు నియోజకవర్గానికి పోలింగ్ రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. వీటితో పాటు 18 శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది.