తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిస్సహాయులకు అండగా.. 'బాబా సుబాసింగ్'​ ఉండగా!

ఒకరికి చూపులేదు, ఇంకొకరికి నా అన్న వారు లేరు.. ఒకరి సాయంతో తప్ప బతకలేరు మరొకరు.. ఒకరికి మానసిక పరిపక్వత లేదు. పంజాబ్‌లోని ఇలాంటి వారందరినీ చేరదీసి, అన్నీ తానై క్షేమంగా చూసుకుంటున్నాడు ఓ అంధుడు. నిస్సహాయ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రోడ్లపై బతికేవారు ఉండకూడదన్న ఆశయంతో ఓ ఆశ్రమం స్థాపించాడు. ఆయనే బాబా సుబాసింగ్.

etv bharat special story about baba suba singh who is became a hero for helpless children in punjab
నిస్సహాయులకు అండగా.. "బాబా సుబాసింగ్'​ ఉండగా!

By

Published : Oct 13, 2020, 1:32 PM IST

నిస్సహాయులకు అండగా.. "బాబా సుబాసింగ్'​ ఉండగా!

నిస్సహాయులకు అండగా నిలిచేవారిని దేవుడే ముందుకు నడిపిస్తాడు. బాబా సుబాసింగ్‌కు సరిగ్గా సరిపోతాయి ఈ మాటలు. పంజాబ్‌, బర్నాలా జిల్లాలోని నారాయణ్‌గఢ్ సోహియాగ్రామంలో అంధచిన్నారుల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్నాడు సుబాసింగ్. ఆయనా చూడలేడు. అయినా తమ కళ్లతో ప్రపంచం చూడలేని ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.

విరాళాలతోనే..

నేత్రహీన్‌ ఆశ్రమంగా పేరుపొందిన ఈ అంధుల ఆశ్రమానికి ప్రత్యేక ఆదాయ వనరులేమీ లేవు. స్థానికులు, పంజాబీల నుంచి వచ్చే విరాళాలతోనే ఆశ్రమం నడుస్తోంది. చూపులేని చిన్నారులు, మానసిక, శారీరక వికలాంగులు, అనాథల భవిష్యత్తుకు దారిచూపే ఓ కాంతిరేఖగా పనిచేస్తోంది. కొద్దిపాటి స్థలంలో 20 ఏళ్ల క్రితం సుబాసింగ్ ఈ ఆశ్రమం ప్రారంభించారు.

"ఇదే ప్రాంతంలో 2000 సంవత్సరంలో నా మిషన్ ప్రారంభించాను. బస్‌స్టాండ్లు, రైళ్లలో అడుక్కునే అంధులు, దివ్యాంగులు, ఇతర ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను ఇక్కడికి తీసుకురాగలిగాను. వాళ్లే కాక, అనాథలు, మానసిక వికలాంగులకూ ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నాం. ప్రస్తుతం 40 మంది చిన్నారులు ఆశ్రమంలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కూడా అలాంటి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడుతుంది. అనాథ, నిరుపేద చిన్నారులు కనిపించినా ఈ ఆశ్రమానికి తీసుకొస్తాం. "

--బాబా సూబాసింగ్, నేత్రహీన్ ఆశ్రమం వ్యవస్థాపకుడు

పైసా తీసుకోరు..

విరాళాలు, సేవాట్రస్టుల నుంచి వచ్చే డబ్బు ఎప్పుడూ దుర్వినియోగమైన దాఖలాలు లేవు ఈ ఆశ్రమంలో. ఇక్కడ అంధులు, నిస్సహాయ చిన్నారులకు దొరుకుతున్న సంరక్షణ చూస్తే నిర్వాహకులను అభినందించకుండా ఉండలేం. ఆశ్రయం పొందేవారి నుంచి పైసా తీసుకోరు.

"చూపులేని చిన్నారుల కోసం ఓ టీచర్‌ను నియమించాం. బ్రెయిలీ లిపిలో అన్నీ నేర్చుకుంటారు. బ్రెయిలీ నేర్చుకున్న వారు కంప్యూటర్‌ తెరలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రీఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్‌ప్లే సాయంతో చూడగలరు, చదవగలరు. కొందరు పిల్లలు స్థానిక పాఠశాలల్లోనూ చదువుతున్నారు. మతపర ప్రార్థనలు చేసేలా శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ కార్యక్రమాలపైనా పాఠాలు చెప్తాం."

--బాబా సూబాసింగ్, నేత్రహీన్ ఆశ్రమం వ్యవస్థాపకుడు

బ్రెయిలీ సాయంతో అన్నీ..

ఈ ఆశ్రమంలో చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వాహకులు..వారికి పాఠశాల విద్యతో పాటు, గుర్బానీ పఠనం, ఇతర కార్యక్రమాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. అంధ చిన్నారులకు బ్రెయిలీ వ్యవస్థ సాయంతోనే అన్నీ నేర్పిస్తారు.

"ఆశ్రమంలో ఐదేళ్లుగా నివసిస్తున్నాం. అంతకుముందు, రాత్రుళ్లు రోడ్లపై గడిపేవాళ్లం. బాబాజీ మమ్మల్ని చూసి, ఆశ్రమానికి తీసుకువచ్చారు."

-- ఆశ్రమవాసి

"పాఠశాల విద్యను అందించడమే కాక, పవిత్ర పుస్తకాలు పఠనం చేయడంపై కూడా మాకు పాఠాలు చెబుతారు. ఆడుకోవడానికి సదుపాయాలు కల్పించారు. మాకేదైనా కావల్సి వస్తే, గురుద్వారా నిర్వహణ కమిటీ అందిస్తుంది."

-- ఆశ్రమవాసి

రోజూ ప్రార్థనలు..

ఆశ్రమ బిల్డింగ్‌లోని పై అంతస్తు..శ్రీగురు గ్రంథ్‌ సాహిబ్‌జీ ప్రార్థనా మందిరానికి కేటాయించారు. ఇక్కడ చిన్నారులంతా రోజూ ప్రార్థనలు చేస్తారు. ఆశ్రమంతో సంబంధమున్న వారంతా చిన్నారులతో తమ అనుభూతులు పంచుకుంటారు.

"2014లో ఆశ్రమానికి వచ్చా. వివిధ వాద్య పరికరాలు వాయించడం, సంగీతం నేర్చుకుంటున్నా. గుర్బానీ పఠనంలోనూ శిక్షణ తీసుకున్నా. మా పాఠాలన్నీ కంప్యూటర్‌లో ఉంటాయి. అవి విని, గుర్తుపెట్టుకుంటాం."

-- ఆశ్రమవాసి

ఆశ్రమ నిర్వహణ సక్రమంగా జరిగేలా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసి ఓ ట్రస్టు ఏర్పాటుచేశాయి. ఈ ఆశ్రమానికి గురుద్వారా చందువానా సాహిబ్ అని కూడా పేరు. నిస్సహాయులకు సాయం చేసి, వారి కాళ్ల మీద వారిని నిలబెట్టేలా చేయాలన్న సిక్కు గురువుల సిద్ధాంతాలు ఈ ఆశ్రమం పాటిస్తోంది.

ఇదీ చూడండి:చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న అక్కాచెల్లెళ్లు

ABOUT THE AUTHOR

...view details