ఝూర్ఖండ్, గిరిడీ జిల్లాలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తన ప్రాంతంలో ఎందరో ఆడపిల్లలను బాలకార్మిక వ్యవస్థ నుంచి కాపాడి బడిబాట పట్టించేందుకు కృషి చేస్తోంది.
ఓ పాట ద్వారా తన తండ్రితో పాటు మరెంతోమంది కన్నవారిని ఆడపిల్లల అభ్యున్నతికి చేయూతనివ్వాలని కోరుతోంది. ఆ ప్రాంత ఆడపిల్లలు ఉండాల్సింది భవిష్యత్‌ను నిర్ణయించుకునే పాఠశాల్లోనే కానీ, పనిలో కాదన్నది తన నిశ్చితాభిప్రాయం. చంపా కృషిని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక డయానా అవార్డుతో సత్కరించింది.
"కొంతమందినైనా నాతోపాటు పాఠశాలకు తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. కష్టంలో ఉన్న వారిని కోసం నేనెందుకు నిలబడకూడదు? వారినెందుకు బడిలో చేర్చకూడదు? బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, చిన్నారులపై దాడులకు వ్యతిరేకంగా నేను గళమెత్తిన తర్వాత స్థానికులు, సామాజిక కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. డయానా అవార్డు వచ్చింది. అది నాకు చాలా సంతోషం కలిగించింది."
--చంపా, డయానా అవార్డ్ విజేత.
వాళ్ల సాయంతో..
మొదట్లో చంపా కూడా పనికి వెళ్లేది. కైలాశ్‌సత్యార్థి ఫౌండేషన్ సహాయంతో ఈ ఊబి నుంచి బయట పడింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలన కోసం కృషి చేస్తోంది.
"చంపా కుమారి జమదాగ్ గ్రామం నుంచి వచ్చింది. గతంలో మైకా గనుల్లో బాలకార్మికురాలిగా పని చేసేది. మా కార్యకర్తలను తనను బడికి ఎందుకు వెళ్లడం లేదని అడిగారు. చంపా కుటుంబం కోసం కష్ట పడుతున్నట్లు తెలిపింది. తర్వాత మా వాళ్లు అమెను బడిలో చేర్పించారు."