ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య పరికరాలు, ఔషధాల నిల్వలు తరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికా వంటి అగ్రదేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే మందుల కొరత అమెరికాలో తీవ్రంగా ఉన్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా సెడేటరీ డ్రగ్స్.. అల్ బ్యూటరాల్, ఫెంటానైల్, మిడాజోలమ్, ప్రోపొఫోల్, వాసోప్రెజర్స్ కు డిమాండ్ అధికంగా ఉంది.
"వెంటిలేటర్‌కు సహకారంగా వాడే మందులకు 95 శాతం ఆర్డర్లు పెరిగాయి. అయితే గత నెలలోనే వీటి లభ్యత 60 నుంచి 70 శాతం తగ్గింది. అమెరికాలో 3 వేల ఆసుపత్రులతో ఒప్పందాలపై చర్చిస్తోన్న విజియెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని చెప్పారు."
- మెడ్ స్కేప్ మెడికల్ న్యూస్
పోర్ట్ లాండ్ విశ్వవిద్యాలయం వైద్యుడు ఎస్తర్ చూ మాటలు పరిస్థితి తీవ్రతను తెలియచెబుతున్నాయి.
"కొన్ని ఔషధాలు లేకుండా వెంటిలేటర్లను వినియోగించలేం. కానీ ఆసుపత్రులన్నీ ఈ మందుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వ్యాధి భారీ తీవ్రతకు చేరకముందే ఈ పరిస్థితి ఉంది."
-ఎస్తర్ చూ, పోర్ట్ లాండ్ విశ్వవిద్యాలయం
కరోనాకు చికిత్స అందించే విషయంలో 15 రకాల ఔషధాల కొరత ఉన్నట్లు నార్త్ కరోలినాలోని ప్రీమియర్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కరోనాతో భారీగా ప్రభావితమైన న్యూయార్క్ లో ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది.