లాక్డౌన్ సమయంలో సిబ్బందిని తొలిగించడం, వేతనాలు చెల్లించకపోవడం, విద్యార్థులను ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేయడం వంటివి చేయకూడదని ఇంజనీరింగ్ కళాశాలలు, ఇతర సాంకేతిక సంస్థలను హెచ్చరించింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). వీటిపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యా నియంత్రణ విభాగానికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏఐసీటీఈ స్పందించింది.
వారిని ఇబ్బంది పెట్టొద్దు!
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు ప్రవేశ రుసుముతో సహా ఫీజులను చెల్లించాలని కొన్ని సంస్థలు పట్టుబడుతున్నాయని ఏఐసీటీఈకి సమాచారం అందింది. దీంతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నంత వరకు విద్యార్థులను, సిబ్బందిని ఒత్తిడికి గురి చేయకూడదని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. తొలిదశ లాక్డౌన్ విధించినప్పటికే విద్యాసంస్థలు మూసివేసి, పరీక్షలు వాయిదా వేశారు. వైరస్ వ్యాప్తి కొనసాగటం వల్ల మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు.