తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: ఉపాధిపై రాజకీయ పకోడీలు

ఉద్యోగాలకు, పకోడీలకు సంబంధం ఏంటి? అధికార, విపక్షాల పరస్పర విమర్శలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది. ఇలా కొంతకాలంగా రాజకీయ వివాదాలకు మూలమైన ఉపాధి కల్పన... ఇప్పుడు ఎన్నికల అంశమైంది. ఉద్యోగ సృష్టిపై భారీ హామీలతో యువతను ఆకట్టుకునే పనిలో పడింది నేతాగణం. 'యువ భారత్'​ ఈసారి ఎవరిని నమ్ముతుంది?

పకోడీ రాజకీయాలు

By

Published : Apr 3, 2019, 6:30 PM IST

ఎన్నికల వేళ పకోడీ రాజకీయాలు
2020 నాటికి దేశ జనాభాలో యువత 34 శాతం ఉంటారని ఓ అంచనా. వారి మెప్పు పొందితే ఎన్నికల్లో సగం విజయం ఖాయమైనట్టే. ఈ దిశగానే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. హామీలు ఇస్తున్నాయి.

2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభంజనానికి ప్రధాన కారణాల్లో ఒకటి యువత. మోదీ నిరుద్యోగ భూతాన్ని తరిమికొడతారని నమ్మింది. భాజపాకు జైకొట్టింది. ఐదేళ్లు గడిచాయి. వారి నమ్మకాన్ని మోదీ సర్కార్​ నిలబెట్టిందా? ఈ ప్రశ్నకు లేదనే సమాధానం ఇస్తున్నాయి విపక్షాలు. ఉపాధి కల్పన హామీలను నెరవేర్చటంలో మోదీ దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నాయి. ఈ విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతోంది అధికార పక్షం. ఇరు పక్షాలు చెబుతున్న మాటల్లో ఎంత నిజముందనేది ప్రశ్నగానే మిగిలింది.

ఉద్యోగం అడగడం కాదు... ఇచ్చే స్థాయి రావాలి!

"ఉద్యోగాల కోసం ఎందుకు వెతుకులాట? మీ కాళ్ల మీద మీరు నిలబడేందుకు ఎందుకు ప్రయత్నించట్లేదు? నేను కోరుకునేది ఏంటంటే.. మన దేశ యువత ఉద్యోగార్థులుగా ఉండకూడదు. ఉద్యోగాలు సృష్టించగలగాలి. మరి కొంతమందికి ఉద్యోగమిచ్చే స్థాయికి రావాలి. అదే మన లక్ష్యంగా మారాలి."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి:భారత్​ భేరి: విజయం కోసం కాంగ్రెస్​ 'పంచతంత్రం'

మోదీ పదేపదే చెప్పే మాట ఇది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది కేంద్రం. అంకుర సంస్థలకు చేయూత ఇచ్చేందుకు చేపట్టిన స్టార్టప్​ ఇండియా..., సొంత వ్యాపారం ప్రారంభించేవారికి రుణాల కోసం ముద్రా యోజన..., యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రధాన మంత్రి కౌశల్​ వికాస్ యోజన ఇందులో ప్రధానమైనవి. ఈ పథకాలతో ఇప్పటికే కోట్లాది మంది లబ్ధి పొందారన్నది అధికార పక్షం మాట.

క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిందా?

ఈ మూడు పథకాలు అమలు పరిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని చెబుతున్నాయి వేర్వేరు నివేదికలు. ఇటీవల జాతీయ సర్వే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ నుంచి లీకైనట్టు చెబుతున్న నివేదిక సారాంశమూ అదే. నిరుద్యోగం 2012తో పోల్చితే 40 ఏళ్ల గరిష్ఠానికి అంటే 6.1 శాతానికి చేరిందని ఎన్​ఎస్​ఎస్​ఓ నివేదికను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సంస్థ 2012లో విడుదల చేసిన నివేదికలో 2.7 శాతమే నిరుద్యోగం ఉంది.

"2018లో కోటి ఉద్యోగాలు కోల్పోయామని సీఎంఐఈ నివేదిక చెబుతోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు రాకపోగా ఇంత నష్టం జరిగింది. ప్రభుత్వం దాచాలని చూసిన ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో ఐదేళ్లలో 4.7 కోట్ల ఉద్యోగాలు కోల్పోయామని ఉంది. అందుకే లోక్​సభ ఎన్నికలకు ముందు ఐదేళ్ల పాలనలో ఉపాధి కల్పన అంశాన్ని పరిశీలించుకోవాలి. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. ఇది యువత వ్యతిరేక ప్రభుత్వమని ధీమాగా చెప్పొచ్చు."
-అనుపమ్, 'యువ హల్లాబోల్' ఉద్యమ నేత

"ఈ ఎన్నికల్లో ప్రధానాంశం యువతకు ఉద్యోగాలు లేకపోవటం. దీనికి తోడుగా దేశవ్యాప్తంగా ఏడాదిలో 1.1 కోట్ల ఉద్యోగాలు కోల్పోయాం. చిన్న తరహా పరిశ్రమలు మూతపడి 10 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇందుకు కారణం నోట్లరద్దే. మోదీ ప్రభుత్వానికి ఆర్థిక అంశాలు తెలియవు. ఏం చెయ్యాలో తెలియదు. డిమాండ్ లేని సమయంలో వడ్డీ రేట్లు పెంచింది. నిర్మాణరంగం పూర్తిగా ఆగిపోయింది. వ్యవసాయేతర రంగాల్లో 40 శాతం ఉద్యోగాలు నిర్మాణ రంగంలోనివే."
-ప్రేమ్ శంకర్ ఝా, ఆర్థికవేత్త

ఇదీ చూడండి:వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

నివేదికలేఅస్త్రాలుగా...

నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు దెబ్బతిని... అనేక మంది ఉపాధి కోల్పోయారని ఎప్పటినుంచో ఆరోపిస్తోంది విపక్షం. నిరుద్యోగం పెరిగిందంటూ ఇటీవల వచ్చిన నివేదికల్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది.

"మరో పెద్ద ప్రచారమేంటంటే.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మోదీ. 2016-17లో 4 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అదే చైనాలో 24 గంటలకు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంటే మీరేమో ఇచ్చింది రోజుకు 400 ఉద్యోగాలే. హామీల అమల్లో వైఫల్యానికి ఇది నిదర్శనం. ఉద్యోగాలను అధికంగా సృష్టించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నోట్ల రద్దుతో దెబ్బ కొట్టారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

'పకోడీ'పై పెను దుమారం

విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఓ ఛానల్​కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మోదీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి.

"కొందరు వ్యవసాయం చేస్తారు. మరికొందరు పకోడీ దుకాణం పెట్టుకుంటారు. ఛాయ్ అమ్ముకుంటారు. వీటి ద్వారా వారికి ఆదాయం వస్తుంది. ఓ పకోడీవాలాను చూస్తే రోజుకు రూ.200 సంపాదిస్తారు. అది వారికి కావాల్సిన తిండి, బట్టకు సరిపోతుంది. దీన్ని ఉద్యోగమని అనలేమా?"
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి:భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

ఎన్నికల వేళ మళ్లీ చర్చ

ఉపాధి కల్పనపై చర్చ... మోదీ వ్యాఖ్యలతో పకోడీ రాజకీయంగా మారింది. అధికార, విపక్షాల మాటలదాడులతో దేశం హోరెత్తింది.

ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగం సమస్య తెరపైకి వచ్చింది. వేర్వేరు నివేదికల ఆధారంగా రాజకీయ వ్యూహాలు రచించాయి పార్టీలు. ఎన్నికల్లో గెలుపు కోసం యువతను ఆకర్షించే ప్రయత్నాల్లో పడ్డాయి. భారీ హామీలతో ముందుకొచ్చింది కాంగ్రెస్​. అంతే దీటుగా సిద్ధమవుతోంది భాజపా. ఉపాధి కల్పనలో యువత ఏ పక్షాన్ని నమ్ముతుందనేది మే 23నే తేలనుంది.

ఇదీ చూడండి:'మోదీ... ధైర్యముంటే నాతో చర్చకు రండి'

ABOUT THE AUTHOR

...view details