తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్వత్రా ఉత్కంఠ.. కాసేపట్లో 'భారత్​ తీర్పు'

2019 లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలన్నీ  భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమికే స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపాయి. వీటిని తప్పుడు ప్రచారం అని ప్రతిపక్షాలు కొట్టి పారేశాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయా అని యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.  నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అవుతారా? యూపీఏకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యలో సీట్లు వస్తాయా?... మరికొద్ది గంటల్లో  తేలిపోనుంది.

By

Published : May 23, 2019, 5:33 AM IST

Updated : May 23, 2019, 7:04 AM IST

'భారత్​ తీర్పు'

'భారత్​ తీర్పు'

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన రోజు నేడు. ఏప్రిల్​ 11నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో జరిగిన లోక్​సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్​ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో తేలిపోనుంది. ఎగ్జిడ్ పోల్స్​వి తప్పుడు లెక్కలని చెబుతున్న ప్రతిపక్షాలు ఏ మేరకు ఆశించిన ఫలితాలు పొందుతాయో స్పష్టత రానుంది.
2014లో భాజపా 282 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ కేవలం 44 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి మొత్తం 336 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

రికార్డు స్థాయిలో పోలింగ్​

ఈ ఎన్నికల్లో 67.11 శాతం ఓటింగ్​ నమోదైంది. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. మొత్తం 542 లోక్​సభ స్థానాల్లో 8,049 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తొలిసారి వీవీప్యాట్​ స్లిప్పులను ఈవీఎంలలో వచ్చిన ఓట్ల లెక్కతో సరిపోల్చనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రకియ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల 30 వేల పోలింగ్​ కేంద్రాల్లో 20 వేల 600 కేంద్రాల వీవీప్యాట్​ స్లిప్పులును మాత్రమే ఈవీఎం ఓట్ల లెక్కతో పోల్చనున్నారు.

చరిత్రలో తొలిసారి..

స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు పాల్పడ్డాయి. చౌకీదార్ చోర్​హై, అత్యంత అవినీతి పరుడు వంటి తీవ్ర పదజాలంతో ప్రచారం నిర్వహించాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

18 లక్షల మంది...

మొత్తం 18 లక్షల మంది సర్వీస్​ ఓటర్లున్నారు. ఈ సర్వీస్​ ఓటర్లలో సాయుధ బలగాలు, కేంద్ర బలగాలు సహా ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఇందులో 16 లక్షల 49 వేల మంది సంబంధిత రిటర్నింగ్​ అధికారికి మే17 లోపు తమ పోస్టల్​ బ్యాలెట్లు అందించారు. వీటిని ముందుగా లెక్కిస్తారు.

లెక్కింపు ప్రారంభించిన 2 గంటల్లోపే పోస్టల్​ బ్యాలెట్ల గణన పూర్తికానున్నట్లు ఈసీ తెలిపింది. వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు చివర్లో జరగనుంది.

ఎలా లెక్కిస్తారు.?

మొదట పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత ఈవీఎంలు. చివర్లో వీవీప్యాట్​ స్లిప్పులతో సరిపోల్చుతారు. ఒక వేళ రెండింటికీ వ్యత్యాసముంటే వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు.
స్లిప్పుల లెక్క ప్రక్రియకు అదనంగా 4 నుంచి 5 గంటల సమయం పట్టనుంది.

పటిష్ఠ బందోబస్తు...

ఎన్నికల సంఘం లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అదనపు కేంద్ర బలగాలను మోహరించింది.

ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సహా చాలా మంది ప్రముఖులు ఈ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

Last Updated : May 23, 2019, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details