తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రగతి ప్రణాళికా? ప్రలోభ పత్రమా?

ఉచిత పథకాలు, నెలనెలా వేలకు వేలు నగదు బదిలీలు, మరెన్నో హామీలు....! ఎన్నికల వేళ అనేక పార్టీల మేనిఫెస్టోల్లో కనిపిస్తున్నవి ఇవే. మేనిఫెస్టో అంటే ఇంతేనా? ప్రజాకర్షక పథకాలు చాలా? ప్రగతి ప్రణాళికలు పెద్దగా పట్టవా?

By

Published : Mar 20, 2019, 7:17 AM IST

మేనిఫెస్టోలోని హామీల అమలు జరుగుతోందా?

మేనిఫెస్టో అంటే ఇంతేనా? ప్రగతి ప్రణాళికలు పెద్దగా పట్టవా?
2014 ఏప్రిల్​ 7...! ఉదయం 10గంటలు. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ అప్పుడే జోరందుకుంది. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. ఎన్నో ప్రజాకర్షక వాగ్దానాలు ప్రకటించింది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం... పోలింగ్​కు 48గంటల ముందు ప్రచారం ఆపేయాలి. అలాంటప్పుడు మేనిఫెస్టో విడుదల చేయొచ్చా? చేయకూడదనేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. తొలి దశ పోలింగ్​కు చివరి 48 గంటల్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయకూడదనే నిబంధన తెచ్చింది.

ఆలస్యమెందుకు?

అసలు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ముందే విడుదల చేయొచ్చు కదా.. అనే సందేహం రావొచ్చు. దీనికీ ఓ లెక్కుంది.

ఈ కాలం మేనిఫెస్టోల్లో ఉచిత హామీలు, భారీ పథకాలే అధికం. గెలిస్తే చాలు అమలు గురించి తర్వాత ఆలోచిద్దాంలే అన్న ధోరణే కనిపిస్తుంది.

ముందుగానే విడుదల చేస్తే మేనిఫెస్టోలోని అంశాలపై విస్తృత చర్చ జరుగుతుంది. ప్రకటించిన పథకాల అమలు సాధ్యాసాధ్యాలపై విశ్లేషణకువీలుంటుంది. ఆర్థిక, ఇతర వనరులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశాలే. అందుకే ఆలస్యంగానే మేనిఫెస్టోలను విడుదల చేసేందుకు మొగ్గుచూపుతాయి.

చెప్పినవన్నీ చేస్తున్నాయా?

ఎన్నికల మేనిఫెస్టోలో భారీ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న పార్టీలు... గెలిచాక మాత్రం వాటిని అంత పకడ్బందీగా అమలు చేయడం లేదన్నది వాస్తవం. కొన్ని హామీలైతే ఎన్నికల తర్వాత కనీసం చర్చకు రావడం లేదు. సంక్షేమ ఫలాలు అందరికీ అందడం లేదనేది మరికొందరి ఆవేదన. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఎన్నికల సంఘమే కఠిన నిబంధన తీసుకురావాలని చాలా మంది ప్రతిపాదిస్తున్నారు.

"ఎన్నికలు... ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చే కార్యక్రమంగా ఉండాలి"
-- ఎల్​ కే అడ్వాణీ, భాజపా అగ్రనేత

మారుతున్న జనవాణి

దేశంలో ఓటర్ల సంఖ్య దాదాపు 90కోట్లు. ఎన్నికల తర్వాత మేలు జరుగుతుందన్నది వారి ఆకాంక్ష. విద్య, వైద్యం, ఉద్యోగం వంటి అంశాలపై పార్టీలు ఎలాంటి హామీలు ఇస్తున్నాయో తెలుసుకునేందుకు వారికి ఉన్న ప్రధాన మార్గం... మేనిఫెస్టో.

ఇప్పుడు ప్రజల్లో రాజకీయ చైతన్యం వస్తోంది. ఎన్నికల వాగ్దానాలను అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీలు ఇవ్వాలనే డిమాండ్లు, ఉల్లంఘనలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి.

"దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, ల్యాప్​టాప్​ల పంపిణీ లాంటి హామీలను ఇచ్చినప్పటికీ ఎన్నికల అనంతరం ప్రజలను మోసం చేస్తున్నాయి. అలాంటి పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందించాం. "
- హర్మీత్​ సింగ్​, భారతీ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు

మేనిఫెస్టోలపై సుప్రీం మాట

" రాజకీయ పార్టీలు ప్రకటించే ప్రలోభపూరిత, ఉచిత పథకాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం"

-- మేనిఫెస్టోలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలివి

మేనిఫెస్టోల రూపకల్పనలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన, చేయకూడని అంశాలపై మార్గసూచీ రూపొందించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశించింది.

ఆర్థిక నిపుణుల మాటేంటి

సంక్షేమ హామీల పత్రాలు కాకుండా... రాజకీయ పార్టీలు అభివృద్ధి మేనిఫెస్టోలు తీసుకురావాలన్నది రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ వంటి నిపుణుల సూచన. రాజకీయ పార్టీలు ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూనే ఉన్నాయి. సంక్షేమం పేరిట ఉచిత హామీలకే పెద్దపీట వేస్తున్నాయి.
"మన దేశం జీడీపీలో ఫ్రాన్స్​ను దాటేసింది. అభివృద్ధి చెందేందుకు భారత్​కు ఇది కీలక సమయం. ఇప్పుడు రాజకీయ పార్టీలు వివేకంగా వ్యవహరించి, దేశం అభివృద్ధి చెందేలా మేనిఫెస్టోలను రూపొందించాలి" అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈసీ నిబంధనతో లాభమెంత?

మేనిఫెస్టోల విడుదల గడువుపై ఈసీ ఓ నిపుణుల కమిటీ నియమించింది. తొలిదశ ఎన్నికలకు కనీసం 3 రోజుల ముందే అన్ని పార్టీలు మేనిఫెస్టో ప్రకటించేలా ఆదేశించాలని ప్రతిపాదించింది. అయితే ఈసీ దాన్ని 48 గంటలకే కుదించింది.

ఎన్నికల షెడ్యూలుకు ముందే రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలను ప్రకటించాలని ఎన్నికల సంఘం నిబంధన విధించి ఉంటే మరింత లాభదాయకంగా ఉండేది. పార్టీలు ప్రకటించే హామీలపై విస్తృత చర్చకు వీలుండేది. కానీ ఈసీ తెచ్చిన 48 గంటల నిబంధన మరీ అంత ఉపయోగకరం కాదన్నది నిపుణుల అభిప్రాయం.

ఎక్కడ ఎంత గడువు?

  • ఎన్నికలకు 5 నెలల ముందుగానే మెక్సికోలోని రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలను ప్రకటిస్తాయి. అందులోని అంశాలను స్పష్టంగా వెల్లడిస్తాయి.
  • అగ్రరాజ్యం అమెరికాలో ఓటింగ్​కు రెండు నెలల ముందే మేనిఫెస్టోలను ప్రకటిస్తాయి పార్టీలు. ఎలాంటి విధానాలు అనుసరిస్తారు, ప్రజలకు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పేస్తారు పోటీలో ఉండేవారు. హామీలపై చర్చలు నిర్వహిస్తారు. దీనివల్ల ఎవరి విధానమేంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది.
  • భూటాన్​లోనూ ఎన్నికల మేనిఫెస్టోలు పోలింగ్​కు 3 వారాల ముందే వెల్లడవుతాయి.

ABOUT THE AUTHOR

...view details