'మత స్థలాల్లో ప్రచారం వద్దు' ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారాలను నిర్వహించకూడదని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనితో పాటు కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే విధంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని తేల్చి చెప్పింది. మసీదుల వద్ద రాజకీయ ప్రచారాలను చేపట్టకుండా పరిశీలకుల్ని నియమించాలని భాజపా ఇటీవలే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ తాజాగా ఈ సూచనలు జారీ చేసింది.
"ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్నికల ప్రచారాలలో కులం, మతాల వాడకం నిషిద్ధం"- దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి.
కేరళలో ఎన్నికల ప్రచారాల కోసం శబరిమల అంశాన్ని ఉపయోగించవద్దని ఈ నెల 11న రాజకీయ పార్టీలను ఈసీ ఆదేశించింది.
సుప్రీం సైతం...
జనవరి 2017లో ఇదే తరహా ఆదేశాలను ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. మతం, కులం, జాతి, వర్గం, భాషల ఆధారంగా ఓట్లు అడగడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగే లోక్సభ ఎన్నికల నిమిత్తం మార్చి 10నే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.