తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎమ్ఎన్ఎమ్) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌కు ఎన్నికల ప్రచారంలో మరోమారు చేదు అనుభవం ఎదురైంది. కోయంబత్తూర్ జిల్లా సులురు నియోజకవర్గానికి జరుగుతోన్న ఉపఎన్నికల నేపథ్యంలో అరవకురుచిలో గురువారం ప్రచారం నిర్వహించారు కమల్. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేదికపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడికి నిరసనగా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ప్రసంగం ముంగించుకుని కమల్ వేదిక దిగుతుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. భద్రతా చర్యల నిమిత్తం కమల్‌ను అక్కడి నుంచి తరలించారు.
తిరుప్పరంకుంద్రమ్ ప్రచారానికి వెళుతుండగా ఆయన వాహనంపైకి చెప్పులు విసిరిన ఘటన జరిగిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది.