తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రాల దన్నుతోనే ప్రగతి పొద్దు - సులభతర వాణిజ్య ర్యాంకింగ్లో భారత్​ 63వ స్థానం

ప్రపంచ బ్యాంక్​ ఇటీవలే విడుదల చేసిన సులభతర వాణిజ్య ర్యాంకింగ్లో 63వ స్థానంలో నిలిచింది భారత్​. అనేక అంశాల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలే.. ర్యాంకు మెరుగుపడటానికి కారణం. ​సులభతర వాణిజ్య ర్యాంకులపరంగా భారత్‌ పురోగమన వేగం సాంత్వన కలిగించే పరిణామం. అదే సమయంలో, అగ్రపీఠిన కొనసాగుతున్న దేశాలతో పోలిస్తే మనం ఎక్కడున్నామన్న ఆత్మశోధన అత్యావశ్యకం.

రాష్ట్రాల దన్నుతోనే ప్రగతి పొద్దు

By

Published : Oct 26, 2019, 2:12 PM IST

సులభతర వాణిజ్య నిర్వహణకు దోహదపడటంలో 190 దేశాల పనితీరును తులనాత్మకంగా మదింపు వేసిన ప్రపంచ బ్యాంకు తాజా విశ్లేషణాత్మక నివేదిక, భారత ప్రస్థానగతిని అభినందించింది. నిరుటితో పోలిస్తే 14 స్థానాలు ఎగబాకిన ఇండియా ఈసారి అరవై మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. వ్యాపార ఆరంభం, నిర్మాణ అనుమతులు, విద్యుత్‌ సరఫరా, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, రుణ లభ్యత, మైనారిటీ పెట్టుబడిదారుల పరిరక్షణ, పన్నుల చెల్లింపు సహా పది భిన్నాంశాల ప్రాతిపదికన ర్యాంకులు క్రోడీకరించగా భారత్‌ మెరుగ్గా రాణించిందని ప్రపంచ బ్యాంకు కితాబిచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది భారత్‌, చైనాలతోపాటు సౌదీ అరేబియా, జోర్డాన్‌, టోగో, బహ్రెయిన్‌, తజికిస్థాన్‌, పాకిస్థాన్‌, కువైట్‌, నైజీరియాలకు అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన పది దేశాల జాబితాలో చోటుదక్కింది. అందులో వరసగా మూడో సంవత్సరం స్థానం సంపాదించడం ఇండియా ఘనత! పొరుగున చైనా నిరుటికన్నా పదిహేను మెట్లు పైకి ఎక్కి 31వ ర్యాంకును ఒడిసిపట్టింది. న్యూజిలాండ్‌, సింగపూర్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా- హాంకాంగ్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా, అమెరికా, జార్జియా, యూకే, నార్వేల మధ్య ర్యాంకులపరంగా హోరాహోరీ కళ్లకు కడుతోంది. తొలి పదింటి సరసన భారత్‌ ర్యాంకు చిన్నగీతే అయినప్పటికీ- దివాలా చట్టం, మేకిన్‌ ఇండియా తదితరాల దన్నుతో దేశం సత్తా చాటుతోందన్న కథనాలు... సాధించింది ఎంతటి కీలక విజయమో ప్రస్ఫుటీకరిస్తున్నాయి. ఇంతటితో సంతృప్తి చెందే వీల్లేదనీ ప్రపంచబ్యాంకు నివేదిక గట్టి సంకేతాలిచ్చింది. రిజర్వ్‌బ్యాంకు మొదలు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) వరకు వివిధ సంస్థలు స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా తెగ్గోసిన నేపథ్యంలో- సులభతర వాణిజ్య ర్యాంకులపరంగా భారత్‌ పురోగమన వేగం సాంత్వన కలిగించే పరిణామం. అదే సమయంలో, అగ్రపీఠిన కొనసాగుతున్న దేశాలతో పోలిస్తే మనం ఎక్కడున్నామన్న ఆత్మశోధన అత్యావశ్యకం.

దేశంలో ఆర్థిక వాణిజ్య సంస్కరణలకు తెరతీసి, లెక్కకు మిక్కిలి నియంత్రణల్ని అరగదీసి ‘లైసెన్స్‌ పర్మిట్‌రాజ్‌’కు చెల్లుకొట్టింది తామేనని పదేపదే చాటుకున్న యూపీఏ జమానాకు, ఆ తరవాతా స్థితిగతుల్లో ఎంతో అంతరముంది. 2006నాటికి వాణిజ్య అనుకూల సూచీలో భారత్‌ది నూట పదహారో స్థానం. తరవాతి ఎనిమిదేళ్లలో ఇండియా 26 స్థానాలు కుంగిపోయి 2014 నాటికి 142వ ర్యాంకుకు పరిమితమైంది. 2005 తరవాత అంగోలా, రువాండా లాంటి ఆఫ్రికా దేశాలు కనబరచిన స్థాయిలోనైనా సంస్కరణాభిలాష భారత్‌లో కొరవడిందన్న ప్రపంచ బ్యాంకు ఘాటు విమర్శలు ఏడేళ్లనాడే యూపీఏ గొప్పలకు గాలి తీసేశాయి. కేంద్రాధికారం చేతులు మారాక గత అయిదేళ్లలో సులభతర వాణిజ్యానికి సంబంధించి ఇండియా 79 ర్యాంకులు మెరుగుపడింది. సుమారు పదిహేనేళ్లుగా ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన మూడు డజన్ల కీలక సంస్కరణల్లో సగం దాకా ఎన్‌డీఏ ఏలుబడిలో పట్టాలకు ఎక్కడమే గుణాత్మక పరివర్తనకు ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకే నిరుడీ రోజుల్లో ప్రస్తుతించింది. అది కేవలం ప్రశంసే కాదు, భావి కార్యాచరణపై అన్యాపదేశ ఉద్బోధ! అంతరార్థాన్ని సరిగ్గానే ఆకళించుకున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నామని ఇటీవలి అమెరికా పర్యటనలో వెల్లడించారు. విదేశీ పెట్టుబడిదారులకు ప్రాధాన్య గమ్యస్థానంగా ఇండియాను తీర్చిదిద్దే విపుల ప్రణాళిక (బ్లూప్రింట్‌)లో భాగంగా జీఎస్‌టీ (వస్తుసేవా సుంకం) సరళీకరణనూ ఆమె ప్రస్తావిస్తున్నారు. పన్నుల చెల్లింపు సౌలభ్యం రీత్యా భారత్‌ ఇప్పటికీ 115వ స్థానాన నిలవడం, సత్వర ఇతోధిక సంస్కరణల అవసరాన్ని సూటిగా సూచిస్తోంది. మూడేళ్ల వ్యవధిలోనే అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ)లో దాదాపు ముప్ఫై స్థానాలు దిగజారిన ఇండియా, ఇతరత్రా పూడ్చుకోవాల్సిన కంతల్నీ మరేమాత్రం విస్మరించే వీల్లేదు.

న్యూజిలాండ్‌లో ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఒక్క పూట చాలు. అక్కడ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అనేది గంటల వ్యవధిలో ముగిసే ప్రక్రియ. సింగపూర్‌ నుంచి ఎగుమతుల అనుమతి మంజూరుకు పట్టే సమయం కేవలం పది గంటలు. భారత్‌లో నేటికీ నిర్మాణ అనుమతుల జారీకి సగటున 106 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు 58, విద్యుత్‌ సరఫరాకు 53 రోజుల వరకు పడుతోందంటున్న నివేదిక- స్థానిక కోర్టులో వాణిజ్య వివాద పరిష్కరణకు 1,445 రోజులు ఎదురుతెన్నులు కాయాల్సిందేనని లెక్క చెప్పింది. ఆస్తుల నమోదులో 154వ ర్యాంకు, కాంట్రాక్టుల అమలులో 163వ స్థానం... ఇవన్నీ ఏయే అంశాల పరంగా ఎంతగా వెనకబడి ఉన్నామన్నది విశదీకరించేవే. రాష్ట్రాల స్థాయిలో వ్యాపార కార్యకలాపాలకు అవినీతి పెద్ద సమస్యగా మారిందన్న విమర్శలు- క్షేత్రస్థాయిలో ప్రతిబంధకాలకు ప్రబల హేతువేమిటో చాటుతున్నాయి. అవినీతి, రవాణాలకు సంబంధించి దుర్భర స్థితిగతులే భారత్‌ ప్రగతి వేగాన్ని కుంగదీస్తున్నాయని గతంలోనే ఫోర్బ్స్‌ నివేదిక తూర్పారపట్టింది. సులభతర వాణిజ్య నిర్వహణలో దేశాన్ని ఉరకలెత్తించడమన్నది కేంద్రానికే పరిమితమైన అంశం కానేకాదు. సంకుచిత రాజకీయ అజెండాల మాటున రాష్ట్రాలు పక్కదారి పడితే ప్రజానీకం విస్తృత ప్రయోజనాలే మంట కలిసిపోతాయి. దేశ జనాభాలో 65 శాతం మేర ఉన్న 35 ఏళ్లలోపు యువజనుల్ని సుశిక్షిత మానవ వనరులుగా మలచుకోగలిగితే- భారత్‌ సమధిక పెట్టుబడుల్నీ ఆకర్షించగలుగుతుంది; నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రబిందువై ఉపఖండం ముఖచిత్రాన్నే మార్చేయగలుగుతుంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తమవంతు విధ్యుక్త ధర్మం సక్రమంగా నిర్వహిస్తేనే- వెలుపలి పెట్టుబడిదారుల్ని సూదంటురాయిలా ఆకర్షించి యావత్‌ దేశం స్థిరంగా పురోగమిస్తుంది!

ABOUT THE AUTHOR

...view details