ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న విచారించనున్న సుప్రీం ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై ఏప్రిల్ 8న విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని అభ్యర్థించారు. రాజ్యాంగ ధర్మాసనం ముందు హాజరవుతానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సైతం సుప్రీంకు నివేదించారు. ఈ అభ్యర్థనలు విన్న జస్టిస్ బాబ్డే, జస్టిస్ నజీర్లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.
"నేను రాజ్యాంగ ధర్మాసనం ముందు హాజరు కావాలనుకుంటున్నా. అనుమతించండి" - కేకే వేణుగోపాల్, అటార్నీ జనరల్.
అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే ఈ చట్టంపై స్టే విధించాలన్న పిటిషన్ను ఇంతకుముందు సుప్రీం కొట్టేసింది.
అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేకూర్చే ఈ చట్టం జనవరి 8న పార్లమెంటు ఆమోదం పొందింది. జనవరి 9 న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఇదీ చూడండి:'రామ్ కీ జన్మభూమి' వాయిదాకు సుప్రీం నిరాకరణ