దేశంలో కొద్ది రోజులుగా భూప్రకంపనల సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మణిపుర్ తమెంగ్లోంగ్ జిల్లాలో భూమి కంపించింది. దాదాపు నెలన్నర రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో భూకంపం రావడం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. నాలుగు రోజులక్రితం ఉఖ్రుల్ జిల్లాలో భూమి కంపించింది.
తమెంగ్లోంగ్ జిల్లాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్సీఎస్) వెల్లడించింది. శనివారం రాత్రి 11.08 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
ప్రస్తుత ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.