తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయం జీవించాలంటే సతతహరిత విప్లవం రావాలి'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావించిన లక్ష్యాల్లో రైతుల ఆదాయ రెట్టింపు కూడా ఒకటి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ లక్ష్యం నెరవేరుతుందా? రైతులకు స్థిరమైన ఆదాయం రావాలంటే ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి? వ్యవసాయ రంగ భవిష్యత్​ ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయాలపై ప్రముఖ జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ అందించిన సమాధానాలు మీకోసం ప్రత్యేకం.

Dr.M.S.Swaminathan Interview
'వ్యవసాయం జీవించాలంటే సతతహరిత విప్లవం రావాలి'

By

Published : Jan 26, 2020, 8:36 PM IST

Updated : Feb 28, 2020, 1:46 AM IST

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ వివరించారు. వ్యవసాయం వైపు యువతను ఆకర్షించకపోతే రైతుకి భవిష్యత్తు ఉండదని అన్నారు. రైతులకు శాస్త్రీయ విజ్ఞానం అవసరమన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ రైతులకు ప్రయోజనం చేకూరకపోవడానికి గల కారణాలను వివరించారు.

డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా?

ఆర్థిక వ్యవస్థకు రైతుల ఆదాయం ఎంతో కీలకం. రాబడి లేనప్పుడు... ప్రతిసారి రుణాలు మాఫీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం రుణమాఫీ అనేది ప్రజారంజకంగా మారింది. రైతులు ఎందుకు రుణమాఫీ కోరుకుంటున్నారన్న విషయం విశ్లేషిస్తే.. వారికి సరిపడా ఆదాయం లేదనే సమాధానం వస్తుంది. యువకులను వ్యవసాయం పట్ల ఆకర్షితులను చేయడానికి వ్యవసాయం ఆర్థికంగా నిలదొక్కుకోవటం తప్పనిసరి. 45 శాతం మంది యువత గ్రామాల్లో జీవిస్తున్నారు. అందులో చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ కారణాల వల్లే ప్రభుత్వ భవిష్యత్తు విధానాలన్నీ దిగుబడిపై కాకుండా రాబడి ఆధారితంగా ఉండాలని నేను అధ్యక్షత వహించిన రైతు జాతీయ కమిషన్(స్వామినాథన్ కమిషన్) సూచించింది. దిగుబడి అవసరమే కానీ ఆదాయమే అన్నింటికన్నా ముఖ్యం.

దీన్ని దృష్టిలో ఉంచుకునే కొన్ని సంవత్సరాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రధాని మోదీ తన లక్ష్యాన్ని వ్యక్తపరిచారు. నా దృష్టిలో ఇది సాధ్యమే. అయితే రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడం ముఖ్యం.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సహా స్థిరమైన ఆదాయం రావడానికి ప్రభుత్వం ఏయే చర్యలు చేపట్టాలి?

దిగుమతి ధర, ఎగుమతి ధర, పన్ను విధానాలు, నీటిపారుదల, మార్కెటింగ్ సదుపాయాలు, పంట కోత అనంతరం ఉపయోగించే సాంకేతికతలపై దృష్టిపెట్టాలి. ఉదాహరణకు మయన్మార్​లో వరి మొక్కలోని ప్రతి భాగాన్ని సక్రమంగా ఉపయోగించడం వల్ల రైతుల ఆదాయం మూడు, నాలుగు రెట్లు పెరిగింది. దీన్నే రైస్ బయో పార్క్​ అంటారు. మన దేశంలోనూ ఇలా రైస్​ బయోపార్క్​ లేదా వీట్(గోధుమ) బయోపార్క్​లు ఏర్పాటు చేయవచ్చు. ప్రతి మొక్కకీ ఆర్థిక విలువ ఉంటుంది. అందులో మనం 40-50 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నాం. మనకున్న అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలి.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు అవుతున్నాయా?

రైతులకు ఆదాయాన్ని అందించే విధానాల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. మనం ఏదైనా పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు ఆదాయం ఎంత అన్న విషయాలపైనే చర్చిస్తాం. కానీ వ్యవసాయంలో జనాభా అవసరాలను లెక్కిస్తాం. ఇప్పుడు.. రైతులు, ప్రజలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ధరల విధానం, ఉత్పత్తి, విపణులు వస్తున్నాయి. ఉత్పాదకత పెంచడం సహా రైతుల ఆదాయ వృద్ధి కోసం అనుసరించాల్సిన ఎన్నో విధానాలను నేను సూచించాను. ఉదాహరణకు హైబ్రిడ్ వరిని పండిస్తే హెక్టారుకు 5-7 టన్నుల ఉత్పత్తి లభిస్తుంది. సాధారణ వరి పంట వేస్తే 1-2 టన్నుల దిగుబడి వస్తుంది. దీన్ని బట్టి హైబ్రిడ్ ద్వారా ఐదు టన్నుల ఆదాయం ఎక్కువగా వస్తుంది. హైబ్రిడ్ పంటతో పాటు మొక్క జీవ పదార్థం ద్వారా రైతుల ఆదాయం పెంచవచ్చు.

డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్

ఈ మధ్య కాలంలో ఆహార ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు రైతులకు మాత్రం తమ ఉత్పత్తులకు తక్కువ ధరలే వస్తున్నాయి. మార్కెట్​లో ఉన్న డిమాండ్-సరఫరా సమస్యా లేక దీని ద్వారా దళారీలే అధికంగా ఆర్జిస్తున్నారా?

ఈ సమస్యకు వివరణ ఇవ్వాలంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా డిమాండ్​, సరఫరాలే ధరను నిర్దేశిస్తాయి. రెండోది భూమిని ఉపయోగించే పద్ధతి. దేశంలోని వనరులను ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కృషి విజ్ఞాన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నేను 1960లోనే సిఫార్సు చేశాను. ఈ కేంద్రాల ద్వారా రైతులు కొత్త సాంకేతికతలను నేర్చుకుంటారు. మనకు శాస్త్రీయ విజ్ఞానం మరింత అవసరం. వ్యవసాయం విధానాల అభివృద్ధిపై రైతులకు మరింత అవగాహన పెరగాలి. ఇందుకు ప్రసార మాధ్యమాలు చేయూతనందించాలి. నూతన వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆదాయ ఆధారిత వ్యవసాయమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ప్రధాన మంత్రి నవ భారతం గురించి మాట్లాడుతారు. నూతన వ్యవసాయం విధానాలతో కట్టిన పునాదులపైనే నవ భారత్ నిర్మాణం జరగాలి. ఈ విషయంలో ముందుకెళ్లడానికి మనం సరైన స్థితిలో ఉన్నాం. బడ్జెట్​లో ఈ విషయం ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాను. కొన్నేళ్ల అనుభవ పాఠాలతో నూతన వ్యవసాయ విధానం రైతు, పేద ప్రజలతో పాటు వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని ఆశిద్దాం.

ప్రస్తుత బడ్జెట్​ కోసం ప్రభుత్వానికి మీరిచ్చే సూచనలు ఏంటి?

దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగం వ్యవసాయమే. ఇక్కడ రైతులే భూములకు యజమానులు. ఏ పంట పండించాలనే విషయం వారే నిర్ణయిస్తారు. ఇందులో ప్రభుత్వం ఏదో చెయ్యాలని మాట్లాడటం అర్థరహితం. రైతులు ఏం చేయాలన్నదే మనం మాట్లాడుకోవాలి. రైతులు దేశానికి సహకరించేలా వ్యవసాయం చేయాలి. అప్పుడు మార్కెటింగ్ సదుపాయాలపై ప్రభుత్వం తప్పనిసరిగా అధిక పెట్టుబడులు పెడుతుంది.

రుతుపవనాలు, మార్కెట్, నిర్వహణ... ఈ మూడు అంశాలు భారతదేశ వ్యవసాయానికి ప్రధాన మూల స్తంభాలు. ఈ మూడు అంశాలపై శ్రద్ధ చూపిస్తూ... ప్రాంతాలను బట్టి నిర్దిష్ట విధానాలను అభివృద్ధి చేయాలి. వ్యవసాయం అనేది స్థానికతపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతంలో అక్కడి నేల, సాగు నీరు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. అందువల్ల వ్యవసాయంలో జాతీయ విధానం అనే మాటలో అర్థం లేదు. కానీ జాతీయ విధానమే రాష్ట్ర విధానంగా మారాలి. రాష్ట్ర విధానం పంచాయతీ విధానంగా రూపాంతరం చెందాలి.

రాయితీలు, ప్రత్యక్ష నగదు బదిలీలపై చాలా మంది ఆర్థిక వేత్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ రెండింటిలో ఏది ప్రయోజనకరం?

రాయితీలతో పోలిస్తే సరైన సేవలను అందించడమే మంచి చేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. రోడ్లు, మార్కెట్ భవనాలు, స్టోరేజీ నిర్మాణాల వంటి కొన్ని సేవలు రైతులు తమకు తాముగా ఏర్పాటు చేసుకోలేరు. శీతల గిడ్డంగుల కారణంగానే బంగాళదుంప విప్లవం జరిగింది. దిల్లీ నుంచి పంచాయతీ వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం అందించాల్సిన సదుపాయాలు చాలా ఉన్నాయి.

రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి యువత మొగ్గు చూపుతారా?

యువతను వ్యవసాయం వైపు ఆకర్షితుల్ని చేయకపోతే... రైతులకు భవిష్యత్తనేది ఉండదు. నేను వ్యవసాయానికి ఆకర్షితుడినయ్యాను. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ వచ్చినప్పటికీ వ్యవసాయ పురోగతిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఈ రంగం వైపు మళ్లాను. వ్యవసాయ పురోగతి సైన్స్​పై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే వైద్యవిద్య​ నుంచి వ్యవసాయ రంగానికి వచ్చాను.

డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్

వ్యవసాయ రంగ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది?

వాతావరణానికి అనుగుణంగా మార్పు చేసుకుంటూ సాంకేతికత, వాణిజ్యాలను ఒకటిగా చేస్తే వ్యవసాయ రంగ భవిష్యత్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి డబ్బులకంటే సైన్స్​​ అవసరమే ఎక్కువ. రైతులకు అధిక ఆదాయం ఇవ్వడం, వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగేలా చేయడం చాలా ముఖ్యం. అయితే స్థిరమైన వ్యవసాయానికి అవసరమయ్యే కనీస పునాదిని ఎంతవరకు అందిస్తున్నామనే అంశంపైనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇది స్థిరమైన వ్యవసాయ దశాబ్దం. ఇప్పుడు హరిత విప్లవం కాదు.. 'సతతహరిత విప్లవం' రావాలి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ విధానాలు మన దేశీయ విధానాలపై ప్రభావం చూపించవు. మనం అంతర్జాతీయ డిమాండులకు అనుగుణంగా ఉండకూడదు. మనకు జాతీయ వాణిజ్య కమిషన్​ ఉండాలి.

శూన్య పద్దు వ్యవసాయంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వ్యవసాయం దేశం మొత్తాన్ని పోషించగలదా?

శూన్య పద్దు వ్యవసాయాన్ని నేను అంగీకరించను. ఏ విషయంలోనైనా శూన్యమనేది ఉండదు. ఆర్థిక మంత్రి శూన్య పద్దు వ్యవసాయాన్ని సూచించారంటే దానర్థం అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికే.

Last Updated : Feb 28, 2020, 1:46 AM IST

ABOUT THE AUTHOR

...view details