దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రూ. 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్న లెక్కలతో తాము ఏకీభవించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఆరోగ్యశాఖ.
కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి.. వచ్చే సంవత్సర కాలంలో కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చు చేయగలదా?అని ఇటీవలే ప్రశ్నించారు అదర్ పునావాలా. దీనిపై స్పందించారు కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.
"ఈ లెక్కలతో మేము ఏకీభవించడం లేదు. వ్యాక్సిన్ నిపుణులతో ఇప్పటికే ఓ జాతీయ స్థాయిలో కమిటీని వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఇప్పటివరకు ఐదుసార్లు సమావేశమైంది. జనాభాకు సరిపడా వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన సొమ్ములపై ఈ కమిటీ అనేకమార్లు చర్చించింది."