సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. మొత్తం 64శాతం పోలింగ్ నమోదైంది. బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బంగాల్లో అత్యధికంగా 76.66 శాతం పోలింగ్ నమోదైంది. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో 10.5 శాతం ఓట్లే పోలయ్యాయి. 943 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఓటెత్తిన భారతావని...
పోలింగ్ కేంద్రాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
ఘర్షణలు...
బంగాల్ అసాన్సోల్లో తమ పోలింగ్ బూత్ ఏజెంట్‌కు లంచం ఇవ్వజూపారన్న కారణంతో తృణమూల్ కార్యకర్తలు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోతో గొడవకు దిగారు. ఆయన కారును ధ్వంసం చేశారు. మరో చోట భద్రత కోసం కేంద్ర బలగాల్ని వినియోగిస్తున్నారన్న కారణంతో ఓటేయడానికి నిరాకరించారు స్థానికులు.