కరోనా మహమ్మారి వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే జిల్లాల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. హౌసింగ్, పరిశుభ్రత, వైద్య వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చేపట్టిన అధ్యయనంలో తెలంగాణలోని జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తేలింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా.. బిహార్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రాల్లోని జిల్లాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. 'ద లాన్సెట్' జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ప్రస్తుతం ఎక్కువగా కేసులు లేనప్పటికీ భవిష్యత్తులో వైరస్ తీవ్రమయ్యే జిల్లాలను అధ్యయనం గుర్తించింది. ఈ జిల్లాలు తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించినట్లు వెల్లడించింది. ఈశాన్యం మినహా దేశవ్యాప్తంగా ఈ జిల్లాలు ఉన్నట్లు తెలిపింది.
ప్రమాద స్థాయిని బట్టి రాష్ట్రాల ర్యాంకింగ్
- మధ్యప్రదేశ్
- బిహార్
- తెలంగాణ
- ఝార్ఖండ్
- ఉత్తర్‌ప్రదేశ్
- మహారాష్ట్ర
- బంగాల్
- ఒడిశా
- గుజరాత్
ఈశాన్యంలో ప్రశాంతం!
15 సూచికల ద్వారా రాష్ట్రాలపై వైరస్ తీవ్రతను పరిశోధకులు అంచనా వేశారు. సామాజిక ఆర్థిక, జనాభా, గృహ-పరిశుభ్రత, సాంక్రమిక వ్యాధులు, ఆరోగ్య వ్యవస్థ అనే ఐదు అంశాల ఆధారంగా అధ్యయనం చేపట్టారు.
దీని ప్రకారం మధ్యప్రదేశ్‌లో వైరస్ తీవ్రత స్కోరు ఒకటిగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. సిక్కింలో అత్యంత తక్కువగా సున్నాగా ఉన్నట్లు వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రమాదం తక్కువగా ఉందని స్పష్టం చేశారు.