భారత్-చైనా సరిహద్దులో పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ జరగలేదని ప్రకటించింది విదేశాంగ శాఖ కార్యాలయం. తూర్పు లద్దాఖ్‌లో పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ జరిగిందన్న చైనా ప్రకటన నేపథ్యంలో ఈమేరకు స్పందించింది. త్వరలో ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయిలో జరిగే సమావేశంలో పూర్తిస్థాయి ఉపసంహరణపై చర్చించనున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం పైనే దౌత్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని వెల్లడించింది.
పూర్తిస్థాయి ఉపసంహరణలో చైనా నిజాయితీగా ఉంటుందని, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతుందని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ.
చైనా ప్రకటన ఇదే..
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు మంగళవారం చైనా ప్రకటన విడుదల చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్.. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
"ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించాం. మరోసారి కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం" అని తెలిపారు.
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా