తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో కరోనా 2.0పై ఇప్పుడే ఏమీ చెప్పలేం'

భారత్​లో రెండో దశ వైరస్ వ్యాప్తి ఉంటుందో లేదో ఊహించటం కష్టమని ఐసీఎంఆర్ సారథి​ డాక్టర్ బలరామ్​ భార్గవ అన్నారు. దేశంలో భౌగోళిక వైవిధ్యం కారణంగా వివిధ సమయాల్లో కేసుల్లో హెచ్చుతగ్గులు సాధారణమేనని వివరించారు. కరోనా పరీక్షల్లో రోజురోజుకు పురోగతి సాధిస్తున్నామని వెల్లడించారు.

ICMR DG
బలరామ్​ భార్గవ

By

Published : Aug 3, 2020, 7:05 PM IST

కరోనా వైరస్​పై పూర్తి స్థాయి అవగాహన లేదని భారతీయ వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్ సారథి బలరాం భార్గవ అన్నారు. ఏఎన్​ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో డాక్టర్ భార్గవ చాలా విషయాలు వెల్లడించారు. పరిస్థితి వేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా సంక్రమణ, మరణాల రేటులో చాలా వైవిధ్యాలు ఉన్నాయని అన్నారు.

"కొవిడ్- 19కు కారణమయ్యే 'సార్స్ కోవ్​-2' అనేది నోవల్ వైరస్. దీని గురించి ఇప్పిటికీ చాలా విషయాలు మనకు తెలియదు. వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి, మరణాల రేటులో చాలా తేడాలు గమనిస్తున్నాం. అందువల్ల భారత్​లో రెండో దశ వ్యాప్తి ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేం. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లోనే చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. కాబట్టి పరిమిత సమాధానం అంతటికీ వర్తించదు."

- డాక్టర్​ బలరాం భార్గవ

కరోనాను అధిగమించేందుకు ప్రజలు భౌతిక దూరం, మాస్కు వినియోగం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని భార్గవ సూచించారు. జనవరి నుంచి వైరస్​పై ఐసీఎంఆర్ పూర్తి అధ్యయనం చేస్తోందని తెలిపారు. వైరస్​ జీనోమ్​ను వేరు చేసిన తొలి సంస్థల్లో జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్​ఐవీ) ఒకటని గుర్తుచేశారు.

కరోనాకు ముందే..

"కరోనా వ్యాప్తికి ముందే అంటువ్యాధులపై పరిశోధించేందుకు 10 ఆగ్నేయాసియా దేశాలతో సహకార వేదిక ఏర్పాటు చేసుకుంది ఐసీఎంఆర్. నిఫా, జికా వంటి వైరస్​లతో పోరాడేందుకు ఇది సహాయపడుతుంది. 'సమాచారం, అభివృద్ధి​, డెలివరీ' వ్యూహంతో ఎలాంటి ప్రజారోగ్య సమస్యనైనా ఎదుర్కోవచ్చు."

- డాక్టర్ బలరాం భార్గవ

"నిర్ధరణ, విధాన రూపకల్పనలో సాక్ష్యాల ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి సమాచారం ముఖ్యమైనది. ప్రజారోగ్య క్షేత్రంలో ఆవిష్కరణలను నడిపించగల వినూత్న సాధనాల అభివృద్ధి కూడా చాలా కీలకం. ఉదాహరణకు దేశీయంగా అభివృద్ధి చేసిన, కచ్చితమైన 'ఎలిసా' పరీక్షతో దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి ఎంతమేరకు ఉందో గుర్తించవచ్చు. చివరగా, లబ్ధిదారులకు ఈ ప్రయోజనాలు అందేందుకు డెలివరీ చాలా అవసరం" అని వివరించారు బలరాం.

నాలుగో స్థానంలో..

కరోనా పరీక్షల్లో రోజురోజుకు పురోగతి సాధిస్తున్నామని తెలిపారు బలరాం. ఇప్పటివరకు 2 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరీక్షలు చేసిన దేశం భారత్​ అని వెల్లడించారు. నిర్ధరణ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కరోనా సంక్షోభం పూర్తయ్యాక వీటిని ఇతర అంటువ్యాధుల నిర్ధరణకూ వినియోగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details