తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కసబ్​కు శిక్షపడేలా చేసిన ధీర బాలిక.. దీన గాథ - witness against kasab

26/11 ముంబయి దాడులకు పాల్పడిన అజ్మల్​ కసబ్​కు శిక్ష పడేలా చేసిన ధీర బాలిక. కాలిలో బుల్లెట్​ గాయం వేధిస్తున్నా.. ఊతకర్ర సాయంతో కోర్టుకు హాజరై కసబ్​కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ధైర్యం ఆమెది. ఎంతోమంది ప్రాణాలు తీసిన ముష్కరుడిని ఉరికంబం ఎక్కించేలా చేసి శెభాష్ అనిపించుకున్న 10 ఏళ్ల బాలిక దేవికా రోతవన్​. ప్రస్తుతం ఆమె కుటుంబం ఆర్థికంగా చితికిపోయి.. అద్దెకు ఇల్లు దొరకక నరకయాతన పడుతోంది.

devika
devika

By

Published : Nov 29, 2019, 7:00 AM IST

భారతావని గుండెల్ని పిండేసిన ఘోర కలి అది. ముంబయి నగరంపై పాకిస్థాన్‌ ముష్కర మూకలు 2008 నవంబరు 26వ తేదీన సాగించిన మారణహోమం దేశ చరిత్రలో ఓ నెత్తుటి అధ్యాయం. నాటి పీడకలలు బాధితుల్ని ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అలాంటి వారిలో దేవికా రోతవన్‌ ఒకరు. ఉగ్ర దాడికి ప్రత్యక్ష సాక్షి దేవిక. దాడి జరిగిన నాటికి బాలిక వయసు పదేళ్లు. కుడికాల్లో బుల్లెట్‌ దిగినా.. మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించిన ధీశాలి.

ఊతకర్ర సాయంతో కోర్టుకు హాజరై.. కాల్పులకు తెగబడింది ఇతడేనంటూ అజ్మల్‌ కసబ్‌ను గుర్తించడమేకాక అతడు ఉరికంబం ఎక్కేలా సాక్ష్యం చెప్పి శెభాష్‌ అనిపించుకున్న చిచ్చరపిడుగు. ఇప్పుడామెకు 21 ఏళ్లు. కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన తర్వాత తమ కుటుంబం ఒంటరైపోయిందని దేవిక వాపోతోంది. ఆర్థికంగా బాగా చితికిపోయామని, ముంబయిలో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని 'హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే' అనే ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. ఫ్లాట్‌ ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని వివరించింది. గుండెలు పిండేసే దేవిక మనోవేదన ఆమె మాటల్లోనే..

"ముంబయి దాడి జరిగిన రోజు నుంచి నేను దీపావళి జరుపుకోలేదు. భారతదేశం క్రికెట్‌లో గెలిచినా సంబరాలు చేసుకోలేను. పటాకుల శబ్దం విన్నా భయమేస్తుంది.

ఆనాడు ఏం జరిగిందంటే..

నాటి కాల్పుల తాలూకూ భయానక దృశ్యం నా కళ్ల ముందు మెదులుతోంది. ఆ రోజు నేను, నాన్న నట్వర్‌లాల్‌ రోతవన్‌, తమ్ముడు జయేశ్‌ కలిసి బాంద్రా నుంచి ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ)కి వచ్చాం. తమ్ముడు జయేశ్‌ టాయ్‌లెట్‌కి వెళ్లాడు. నేను బయట నిలబడి ఉన్నా. ఇంతలో కాల్పుల మోత వినబడింది. నా కాళ్ల ముందే గ్రెనేడ్‌ పేలింది. జనం చెల్లాచెదురుగా పరుగెత్తుతున్నారు. నేనూ పరుగు అందుకున్నా. ఇంతలో ఓ ఆగంతుకుడు నన్ను చూసి సూటిగా కాల్చాడు. బుల్లెట్‌ కుడికాలి పిక్కలోకి దిగింది. నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయా. చుట్టూ రక్తమోడుతూ, భీకరంగా రోదిస్తూ జనం అటూ ఇటూ పరుగెడుతున్నారు. వెంటనే స్పృహ తప్పాను. నన్ను సెయింట్‌ జార్జి ఆసుపత్రికి తరలించారు.

మరుసటి రోజు మెలకువ వచ్చింది. కళ్లముందే మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను కాల్చిన వ్యక్తి ముఖం నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. సెయింట్‌ జార్జి ఆసుపత్రిలో బుల్లెట్‌ను బయటికి తీసి ఆపరేషన్లు చేశారు. ఆ తర్వాత జేజే ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం నెలన్నర పాటు ఆసుపత్రిలోనే ఉన్నా. గాయం మానిన తర్వాత రాజస్థాన్‌లోని మా స్వగ్రామం సుమేర్‌పూర్‌కు వెళ్లాం.

ఆ తర్వాత ముంబయి పోలీసులు ‘కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? అని మా నాన్నను సంప్రదించారు. నాకు భయం వేయలేదు. తమ్ముడు, నాన్న నన్ను బలపరిచారు. ఆ ముష్కరుడికి తగిన శిక్ష పడాలనేదే నా కోరిక. అందుకే సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యా. మా బంధువులు వద్దని వారించారు. అలా చేస్తే తీవ్రవాదులు దాడి చేస్తారని భయపెట్టారు. అయినా నేను వినకపోయే సరికి.. మాతో మాట్లాడటమే మానేశారు. సాక్ష్యానికి సిద్ధమై ఊతకర్రల సాయంతో 2009 జూన్‌ 10న కోర్టుకు వెళ్లా.

నా ముందు నలుగురు వ్యక్తుల్ని ప్రవేశపెట్టారు. అజ్మల్‌ కసబ్‌ను చూడగానే గుర్తించా. ఇతడే ముష్కరుడని వేలెత్తి చూపా. నా పక్కనే ఉన్న మా నాన్నా అతన్ని గుర్తించారు. కసబ్‌కు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పడం వెనుక ఉద్దేశం ఒకటే. అతను నాపై కాల్పులు జరిపాడు. ఎందరినో పొట్టనబెట్టుకున్నాడు. పోలీసు అధికారుల్ని బలిగొన్నాడు. అతడికి ఉరిశిక్ష పడాలి. అందువల్ల అతన్ని ఎదుర్కొనడానికి నాకు భయం అనిపించలేదు. ఆ ధైర్యాన్ని నాకు మా నాన్నే నూరిపోశాడు. కసబ్‌కు శిక్షపడితే.. అతని కిరాతకానికి బలైన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని భావించా.

ఒక ఐపీఎస్‌ అధికారి కావాలన్న కోరికా నాకు అక్కడే బలపడింది. ఐపీఎస్‌ అయితే ఇలాంటి అన్యాయాలపై పోరాడొచ్చు అనేది నా సంకల్పం. పోయిన ఆ రోజులు మళ్లీ తిరిగిరావని నాకు తెలుసు. కానీ ఎప్పటికైనా నా ఆవేదనకు సమాధానం దొరుకుతుందనే నమ్మకం నాకు ఉండేది. అదే నిజమైంది. 2012 నవంబరు 21వ తేదీన కసబ్‌ను ఉరితీశారు."

-దేవికా రోతవన్​

వెతలు తీరలేదు..

కసబ్‌కు వ్యతిరేకంగా దేవిక సాక్ష్యం చెప్పడం.. ఆమె ధైర్యాన్ని దేశమంతా ప్రశంసించింది. బాగా పేరొచ్చింది. కానీ ఆ తర్వాత ఆమెకు కష్టాలు మాత్రం తీరలేదు. బాలిక తల్లి 2010లో మరణించింది. ఫలితంగా చదువూ దెబ్బతింది. ప్రభుత్వం చేస్తామన్న సాయం చేయలేదు. బంధువులు దూరమయ్యారు. దేవిక తండ్రి పండ్ల వ్యాపారం నష్టపోయింది. ముంబయిలోని కొలాబాలో ఉండే అతని పండ్ల దుకాణం మూతపడింది.

ఇప్పటికీ తమకు బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల ముంబయిలో ఒకచోట కాకుండా వేర్వేరు చోట్లకు తరచూ నివాసం మారుస్తున్నామని చెప్పింది. మాకు వచ్చిన ప్రాచుర్యం చూసి.. ఇళ్ల యజమానులూ విపరీతంగా అద్దె డిమాండ్ చేస్తున్నారని, కొందరు ఇల్లు అద్దెకు ఇవ్వడానికే భయపడుతున్నారని వాపోయింది. గతంలో దాచుకున్న డబ్బుతో, మిత్రుల ఆర్థికసాయంతో ఇప్పుడా కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. కేంద్ర హోంశాఖ రూ.3 లక్షల పరిహారం ఇచ్చింది. ఐపీఎస్‌ అధికారి కావాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు తన చదువులకు ప్రభుత్వం సాయం చేయాలని దేవిక వేడుకుంటోంది.

ఇదీ చూడండి: మందుల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం యోచన..!

ABOUT THE AUTHOR

...view details