దిల్లీలో క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోంది. దాదాపు వారంరోజుల తర్వాత రోడ్లపై జన సంచారం కనిపిస్తోంది. శుక్రవారం ప్రార్థనలు కావటం వల్ల ముందుజాగ్రత్త చర్యగా అదనపు బలగాలను మోహరించారు. చాలాప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో దాదాపు 7వేల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లోని ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దని, తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ఈశాన్య దిల్లీలో హింసకు సంబంధించి 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 630 మందిని అరెస్టు చేశామని.. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. హింసలో 43 మంది మరణించారని.. 250 మందికి పైగా గాయపడ్డారని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని.. దిల్లీ శాంతిభద్రతల ప్రత్యేక కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ తెలిపారు.
"కొన్ని గంటల నుంచి దిల్లీలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. గడిచిన కొన్ని రోజుల్లో మేం శాంతి ప్రదర్శనలు నిర్వహించాం. స్థానికులతో మాట్లాడాం. మా పోలీసు అధికారులు స్థానికులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటోంది. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను నమ్ముతున్నాను. శాంతిని నెలకొల్పే దిశగా అధికారులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ దోపిడి, హత్య, నేరాలకు సంబంధించి వందకుపైగా కేసులు నమోదు చేశాం. క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశాం. జిల్లా పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారు. కుట్రలు పన్నిన వారిని, హక్కులను హరించిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేందుకు కృషి చేస్తాం. రానున్న రోజుల్లో ఆ దిశగా మేం పని చేస్తాం."
- ఎస్. ఎన్.శ్రీవాస్తవ, దిల్లీ శాంత్రిభద్రతల ప్రత్యేక కమిషనర్
"డీసీపీతో కలిసి ఈ ప్రాంతమంతా తిరిగి వచ్చాం. అంతా ప్రశాంతంగా ఉంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. నిన్నటి నుంచి పోలీసుల మార్చ్ ఫాస్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా మౌజ్‌పుర్‌లో పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉంది. "
-మహ్మద్ నదీం, మౌజ్‌పుర్ కౌన్సిలర్
భయానక వాతావరణం..
అల్లర్లు జరిగిన ప్రాంతాలు విధ్వంసకాండకు సజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీధులనిండా రాళ్లు, ఇటుక పెళ్లలు, మంటల్లో కాలిపోయిన రిక్షాలు, తోపుడు బండ్లు, వాహనాలు ఇంకా అలాగే దర్శనమిస్తున్నాయి. చాలాప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
ఫ్యాక్టరీలో సోదాలు..