తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగానే ఈశాన్య దిల్లీ- 38కి చేరిన మృతులు

ఈశాన్య దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 38కి చేరింది. చాలా చోట్ల పరిస్థితులు సద్దుమణిగినా.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారులతో సమీక్ష అనంతరం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ప్రకటించారు.

kejriwal
కేజ్రీవాల్​

By

Published : Feb 27, 2020, 8:09 PM IST

Updated : Mar 2, 2020, 7:08 PM IST

ప్రశాంతంగానే ఈశాన్య దిల్లీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో ఈశాన్య దిల్లీ అట్టుకుడిపోయింది. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 38కి చేరుకుంది. 200 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నారు. ప్రస్తుతం ఈశాన్య దిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం ఉంది.

అల్లర్లు ముగిసి 2 రోజులు అవుతున్నా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి ఇంకా బయటికి రావటం లేదు. వీధుల్లో ఎక్కడ చూసినా భద్రతా దళాలే దర్శనమిస్తున్నాయి. ఈశాన్య దిల్లీలో దుకాణాలు, పాఠశాలలు, మెట్రో స్టేషన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కవాతు నిర్వహించిన పోలీసులు.. భయపడవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు అనుమతిచ్చారు.

ప్రశాంతంగా ఉంది...

అల్లర్లకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సంయుక్త పోలీస్ కమిషనర్​ ఓంప్రకాశ్ మిశ్రా. త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు సమాచారం లేదన్నారు. ఇప్పటివరకు 48 ఎఫ్​ఐఆర్​లు నమోదైనట్లు తెలుస్తోంది.

పరిహారం ప్రకటన

దిల్లీ పరిస్థితులపై అత్యవసర సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు సీఎం.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. 'ఫరిస్తే' పథకం కింద గాయపడిన వారికి వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రైవేట్​ ఆసుపత్రుల్లో చేరినా కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ ఘర్షణల్లో ధ్రువపత్రాలు ఇతర డాక్యుమెంట్లు కోల్పోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు కేజ్రీవాల్.

రెట్టింపు శిక్ష..

దిల్లీ ఘర్షణలకు కారణమైన వారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇందులో ఆప్ నేతల హస్తం ఉంటే రెట్టింపు శిక్ష వేయాలన్నారు. ఐబీ అధికారి అంకిత్ మిశ్రా హత్యకేసులో ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు కేజ్రీవాల్. దేశ భద్రతతో రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.

"ఆప్​, భాజపా, కాంగ్రెస్​ పార్టీలకు చెందినవారు ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, ప్రోత్సహించినట్లు రుజువైనా వారిని కఠినంగా శిక్షించాలి. నా మంత్రిమండలిలోని వ్యక్తులైనా సరే.. దోషులను జైళ్లలో వేయండి. మా వాళ్లు అలా చేస్తే రెట్టింపు శిక్ష విధించండి."

- అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

కేంద్రానిదే బాధ్యత..

దేశ రాజధానిలో అల్లర్లకు సంబంధించి కేంద్రానిదే బాధ్యతని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దిల్లీలో శాంతి భద్రతల వ్యవహారాలు కేంద్రమే నిర్వహిస్తోందని తెలిపింది. అల్లర్లపై దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి కేంద్రాన్నే ప్రతివాదిగా చేర్చింది హైకోర్టు. అంతేకాకుండా విద్వేష ప్రసంగం చేసిన భాజపా నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్​..

దిల్లీ అల్లర్లకు సంబంధించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిశారు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ సీనియర్​ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజీనామాకు డిమాండ్​ చేశారు.

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్న హింసను మౌనంగా చూస్తుండిపోయాయి. హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చాలా మంది చనిపోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం మీపైన ఉంచింది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను తొలగించాలని పునరుద్ఘాటిస్తున్నాం."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

సీబీఎస్​ఈ పరీక్షలు వాయిదా..

దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఫిబ్రవరి 28, 29 తేదీల్లో 10, 12 తరగతులకు జరగాల్సిన పరీక్షలను సీబీఎస్​ఈ వాయిదా వేసింది. పునర్ నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ఆ తేదీల్లో పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది బోర్డు. మిగతా పరీక్షలు మార్చి 2 నుంచి యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.

పాఠశాలల ధ్వంసం..

ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రభుత్వ పాఠశాలలు భారీగా ధ్వంసమయ్యాయి. బృజ్​పురి పాఠశాలలో ఫర్నీచర్​తో పాటు పుస్తకాలు తగలబడ్డాయి. 32 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాల ప్రస్తుతం శ్మశానాన్ని తలపిస్తుందని అధికారులు చెబుతున్నారు. సుమారు రూ.70లక్షల నష్టం వాటిల్లిందని.. 30 ఏళ్ల రికార్డులు, డాక్యుమెంట్లు కోల్పోయామని తెలిపారు.

ఐరాస విచారం

దిల్లీలో జరిగిన అల్లర్లలో 38 మంది ప్రాణాలు కోల్పోవటంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్​ అధికార ప్రతినిధి స్టీఫెన్​ డుజెరిక్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీ పరిణామాలను గుటేరస్​ సునిశితంగా పరిశీలిస్తున్నారని ఇప్పటికే ప్రకటించారు స్టీఫెన్​.

Last Updated : Mar 2, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details