ఒకప్పుడు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలతో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ తాజా ఫలితాల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. అంతేకాదు.. కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్కు ఐదుశాతం కంటే తక్కువే వచ్చాయి. 63 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు.
ముగ్గురు మాత్రమే..
అర్వీందర్ సింగ్(19.66శాతం), దేవేందర్ యాదవ్(19.14), అభిషేక్ దత్(21.42) మాత్రమే డిపాజిట్లు నిలబెట్టుకున్నారు. దిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా కుమార్తె శివానీ చోప్రా, దిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ యోగానంద శాస్త్రి కుమార్తె ప్రియాంక సింగ్, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సతీమణి పూనం ఆజాద్ డిపాజిట్లు కోల్పోయిన ప్రముఖులు.
అంచనాలు తారుమారు!
పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైనారిటీ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో గెలుపు తమదేననే విశ్వాసంతో బరిలోకి దిగింది కాంగ్రెస్. అయితే గెలుస్తామని ఆశించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతికూల ఫలితాలు మూటగట్టుకుంటుండగా.. లోక్సభ ఎన్నికల్లో పర్వాలేదనిపిస్తోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 9.7 శాతం ఓట్లు రాగా తాజా ఫలితాల్లో 4.27 ఓట్లు సాధించి చతికలపడింది కాంగ్రెస్. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మోస్తరుగా 22.46 శాతం ఓట్లు రావడం గమనార్హం.
''సత్వర నిర్ణయాలు, సరైన వ్యూహ రచన లేకపోవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయకపోవడం, అందరిని సమన్వయపరచడానికి సరైన నాయకులు లేకపోవడం కారణంగా దిల్లీలో మా పార్టీకి రెండోసారి ఓటమి ఎదురైంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది.''
-షర్మిష్ఠ ముఖర్జీ, దిల్లీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు