అరేబియా సముద్రంలో ఉత్పన్నమయిన వాయుగుండం.. తుపానుగా మారిందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్లు, ముంబయికి 490, సూరత్‌కు 710 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని చెప్పింది. ఈ తుపానుకు నిసర్గగా నామకరణం చేసింది. బుధవారం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 105-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ముంబయిపై ప్రభావం..
నిసర్గ తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్, గోవా ప్రభుత్వాలు హై అలెర్ట్ ప్రకటించాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయిపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఇప్పటికే కరోనా వ్యాప్తితో అతలాకుతలమవుతున్న ముంబయిని తుపాను ముంచెత్తితే జనజీవనం మరింత దుర్బరమయ్యే అవకాశం ఉంది.
సురక్షిత ప్రాంతాలకు తీర వాసులు..
భారత పశ్చిమ తీరం లక్ష్యంగా నిసర్గ తుపాను ముంచెత్తుకొస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలకు దిగింది గుజరాత్ ప్రభుత్వం. వల్సాడ్, నవ్‌సరి జిల్లాల్లో తీరం వెంట ఉన్న 47 గ్రామాల్లోని 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.