ఆపరేషన్ కశ్మీర్: భగ్గుమన్న రాజ్యసభ సోమవారం కశ్మీర్ అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్టు అమిత్‌షా ప్రకటించినప్పటి నుంచి విపక్షాలు తమ నిరసనలు తెలిపాయి.
అమిత్ షా ప్రకటన...
సోమవారం ఉదయం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్... అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్ధాఖ్‌ను విభజిస్తున్నట్టు షా ప్రకటించారు. దీనితో పాటు జమ్ముకశ్మీర్‌లో 10శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో షా ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి. అనంతరం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి.
"నేను ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రకమైంది. ఈ బిల్లు చరిత్ర సృష్టిస్తుంది. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్లో చాలామంది పేదరికంలో బతుకుతున్నారు. రిజర్వేషన్లతో లబ్ధిపొందలేకపోతున్నారు. అక్కడి మహిళలకు అన్యాయం జరుగుతోంది. అక్కడి ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది. ఆర్టికల్ 370 పేరుతో మూడు కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకున్నాయి."
--- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
'తలను నరికేశారు..'
అమిత్ షా ప్రకటనతో రాజ్యసభ భగ్గుమంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దల సభలో గందరగోళం సృష్టించాయి విపక్షాలు. ఇంతటి సున్నిత అంశంపై తమకు ఎటువంటి సమాచారం అందించకుండానే, అత్యవసరంగా బిల్లును ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టాయి.
"వారం రోజుల ముందు నుంచే జమ్ముకశ్మీర్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. 1947 ముందు నుంచే కశ్మీర్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కశ్మీర్‌కు సంబంధించిన 4, 5 కీలక అంశాలన్నింటినీ ఒకేసారి సభలో ప్రవేశపెడతారని నేను అనుకోలేదు. అప్పుడే చర్చ జరిపి, అప్పుడు అమోదింపజేయాలని కోరుకుంటారనీ ఊహించలేదు. ఇది 57 పేజీల బిల్లు. ఇక్కడకు ఒక్క పేజీ ఉన్న బిల్లలూ వస్తాయి. సభలో అనేక బిల్లులపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. సభలో ప్రవేశపెట్టాలనుకునే బిల్లు రెండు రోజుల ముందే అందరికీ అందాలని పార్లమెంటు నిబంధనల్లో ఉంది. అప్పుడు అందరు వాటిని చదవగలరు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇప్పుడు ఇక్కడ భారతదేశం నుంచి ఒక రాష్ట్రాన్నే తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. 29 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు(భాజపా) వాటిని 28 చేయాలనుకుంటున్నారు. అంటే ఒక రాష్ట్రమే తుడిచిపెట్టుకుపోయినట్టు కాదా?"
--- గులామ్ నబీ ఆజాద్, ప్రతిపక్ష నేత
భారత రాజ్యంగం కాపీలు చింపివేత...
అమిత్‌షా ప్రకటనతో ఆగ్రహించిన ఇద్దరు పీడీపీ నేతలు భారత రాజ్యాంగ కాపీని చింపి నిరసన వ్యక్తం చేశారు. వారిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపివేశారు.
మద్దతు... వ్యతిరేకం
370 ఆర్టికల్ రద్దుకు బీఎస్పీ, ఎస్పీ, వైకాపా, తెదేపా, అన్నాడీఎంకే, బీజేడీ, శివసేన, శిరోమణీ అకాలీ దళ్ మద్దతు ప్రకటించాయి.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలన్న తీర్మానాన్ని, విభజన బిల్లును కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకించాయి. జేడీయూ వాక్ ఔట్ చేసింది.
ఇదీ చూడండి:- 'మోదీ మార్క్' సాహసం... ఆపరేషన్ కశ్మీర్