పుణె జిల్లాలో ఇద్దరు మృతి..
నిసర్గ తుపాను కారణంగా పుణె జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
20:48 June 03
పుణె జిల్లాలో ఇద్దరు మృతి..
నిసర్గ తుపాను కారణంగా పుణె జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
20:04 June 03
ఈశాన్య మహారాష్ట్ర వైపుగా నిసర్గ..
రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ ప్రాంతంలో తీరం దాటిన నిసర్గ ఈశాన్య మహారాష్ట్ర వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో నాశిక్, ధులే, నందుర్బార్ జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పెనుగాలులతో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
18:16 June 03
తీరం దాటిన నిసర్గ తుపాను
మధ్యాహ్నం 2.30 గం.కు తీరం దాటినట్లు భారత వాతావరణశాఖ వెల్లడి
తీరం దాటాక తుపాను బలహీనపడడం ప్రారంభమైంది: వాతావరణ శాఖ
మహారాష్ట్ర: ప్రస్తుతం 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు
పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
ముంబయికి ఆగ్నేయ దిశలో తుపాను కేంద్రం ఉంది: వాతావరణ శాఖ
ముంబయిలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు అధికారుల వెల్లడి
17:54 June 03
ఆస్తి నష్టం పెద్దగా లేదు..
నిసర్గ తుపాను వల్ల ఆస్తి నష్టం పెద్దగా లేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. నగరంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ముంబయి పూర్తి సురక్షితంగా ఉందన్నారు.
17:36 June 03
6 గంటల నుంచి విమానాల రాకపోకలు!
నిసర్గ తుపాను కారణంగా గత 20 గంటలకుపైగా నిలచిపోయిన విమానల రాకపోకలను సాయంత్రం 6 గంటలకు పునరుద్ధరించనున్నట్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
17:16 June 03
నిసర్గ బలహీనపడుతోంది..
నిసర్గ తుపాను మహారాష్ట్ర తీర ప్రాంతాన్ని తాకిన సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, ప్రస్తుతం తుపాను బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి దాని తీవ్రత మరింత తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతం 90-100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు స్పష్టం చేసింది.
17:11 June 03
అవాంఛనీయ సంఘటనలు లేవు..
నిసర్గ తుపాను మహారాష్ట్ర తీరాన్ని తాకినప్పటికీ గుజరాత్లో దాని ప్రభావం అంతగా కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 8 జిల్లాల నుంచి 63, 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
17:06 June 03
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి..
నిసర్గ తుపాను ముంబయి, థానే మీదుగా ఉత్తర మహారాష్ట్ర తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో తక్షణ రెస్క్యూ ఆపరేషన్స్‌కు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ సహా అధికారులతోనూ సమీక్షించారు. తపాను ప్రభావం తగ్గించేందుకు పలు సూచనలు చేశారు.
15:23 June 03
లక్ష మంది తరలింపు
మహారాష్ట్రలోని నిసర్గ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తోన్న సుమారు ఒక లక్ష మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో 43 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయని వెల్లడించారు. నిరాశ్రయుల కోసం 35 కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసింది బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.
15:17 June 03
భీకర గాలులు..
నిసర్గ తుపాను తీరం తాకిన నేపథ్యంలో మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భీకర గాలులతో భారీ వర్షం కురుస్తోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా ఇళ్లు, ఇతర కట్టడాలు దెబ్బతిన్నాయి. రాయ్‌గఢ్‌లోని ఓ భవనంపై ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు గాలికి కొట్టుకుపోయింది.
15:06 June 03
19 గంటలుగా విమానాలు బంద్
మహారాష్ట్రపై నిసర్గ తుపాను ప్రభావంతో విమాన రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడిచిన 19 గంటల నుంచి ఒక్క విమానం టేక్ఆఫ్, ల్యాండింగ్ జరగలేదని వెల్లడించారు అధికారులు.
14:03 June 03
అలల తాకిడి..
మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుపాను తీరాన్ని తాకిన నేపథ్యంలో.. గుజరాత్ కూడా ప్రభావితమవుతోంది. ద్వారకా తీరం వద్ద అలలు పోటెత్తుతున్నాయి.
13:57 June 03
ముంబయిలో భీకర గాలులు..
13:43 June 03
తుపాను ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. 43 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయచర్యల్లో నిమగ్నమయ్యాయి
13:08 June 03
తీరాన్ని సమీపించిన నిసర్గ తుపాను
నిసర్గ తుపాన్ మహారాష్ట్ర తీరాన్ని తాకిందని ఐఎండీ వెల్లడించింది. మరో 3 గంటల్లో ఇది పూర్తిస్థాయిలో తీరాన్ని దాటుతుందని పేర్కొంది.
12:46 June 03
ఈదురు గాలులో భారీ వర్షాలు
మహారాష్ట్ర తీరం వెంబడి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 4 మధ్య నిసర్గ తుపాను తీరం దాటనుంది.
12:42 June 03
సహాయక శిబిరాలకు 50,000 మంది ప్రజలు
నిసర్గ తుపాను మరో రెండు గంటల్లో తీరాన్ని తాకనున్న నేపథ్యంలో.. గుజరాత్, డామన్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50,000 మంది తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
12:33 June 03
ఉరుములు, మెరుపులతో భీకర వర్షాలు
నిసర్గ తుపాన్ తీరాన్ని సమీపిస్తున్న వేళ.. మరో రెండు గంటల్లో పిలానీ, నార్నాల్, బావాల్, రేవారి ప్రాంతాల్లో గంటకు 20 నుంచి 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షాలు కురుస్తాయని, వడగళ్లు కూడా పడే అవకాశముందని ఐఎమ్‌డీ హెచ్చరించింది.
12:32 June 03
12:21 June 03
ముంబయి తీరం వెంబడి ఎగసిపడుతున్న అలలు
ముంబయి తీరం వెంబడి అలలు పోటెత్తుతున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీరంలోనే నిలిచిపోయిన పడవలు.
12:19 June 03
రాయ్‌గఢ్ అలీబాగ్‌లో ఏర్పాటుచేసిన సహాయక శిబిరంలో తన బిడ్డలతో సహా తలదాచుకున్న మహిళ.
12:11 June 03
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్
నిసర్గ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది... తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.
11:49 June 03
రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్
నిసర్గ తుపాను తరుముకొస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్ని ముంబయిలోని వెర్సోవా బీచ్‌లో మోహరించారు.
11:41 June 03
నిసర్గ తుపాను కదలికల యానిమేషన్
గోవా రాడార్ ద్వారా గుర్తించిన నిసర్గ తుపాను కదలికల యానిమేషన్‌ను ఐఎమ్‌డీ విడుదల చేసింది.
11:36 June 03
ఉద్ధృతంగా మారుతున్న నిసర్గ తుపాను
నిసర్గ తుపాను మరింత ఉద్ధృతంగా మారుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య అలీబాగ్‌కు సమీపంలోని హరిహరేశ్వర్, డామన్‌ల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
10:56 June 03
ఇవి పాటించండి: మహారాష్ట్ర
నిసర్గ తుపాను నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనల జాబితా విడుదల చేసింది.
10:27 June 03
ముంబయి తీరం వెంబడి ఎగసిపడుతున్న అలలు
ముంబయి వెర్సోనా తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అలీబాగ్ (రాయ్‌గఢ్)కి సమీపంలో నిసర్గ తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది.
10:05 June 03
తరుముకొస్తున్న నిసర్గ సైక్లోన్
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఇవాళ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
09:36 June 03
ప్రమాదకరంగా మారుతున్న నిసర్గ తుపాను
నిసర్గ తుపాను ప్రమాదకరంగా మారుతోంది. కొంకణ్ తీరం వెంబడితోపాటు వెలుపల ప్రబలంగా గాలులు వీస్తున్నాయి. తీరం దాటే క్రమంలో గాలి వేగం 120 కిలోమీటర్లకు పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.
08:46 June 03
'నిసర్గ' తీవ్రరూపం.. 100కి.మీ వేగంతో వీస్తున్న గాలులు
తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో 85-95 కిలోమీటర్ల నుంచి 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తుపాను తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించింది.
మహారాష్ట్ర ఉత్తర రత్నగిరి ప్రాంతంలో తుపాను తీవ్రత అధికంగా ఉంది. బలమైన గాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కారు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.