'ఫొని' తుపాను నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని ఒడిశా రాష్ట్రానికి మరో గండం ఎదురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకుతూ, బంగాల్, బంగ్లాదేశ్ తీరప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుకు 'బుల్బుల్' అని నామకరణం చేసింది.
'బుల్బుల్' తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశా పారాదీప్, బంగాల్ సాగర్ ఐస్లాండ్ ప్రాంతాలకు దక్షిణ-ఆగ్నేయంగా.. 730, 830 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భువనేశ్వర్ వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.
వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాగాలు తుపాను పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించింది. తుపాను నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 15 జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచించారు.