గంటకు 190 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు, భారీ వర్షాలతో అంపన్ తుపాను తీరం దాటింది. పశ్చిమ్ బంగ, బంగ్లాదేశ్ సరిహద్దులోని దిఘా, హతియా దీవుల సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 155-165కి.మీ వేగంతో బలమైన గాలులు వీచినట్లు వెల్లడించింది.
తుపాను ప్రభావానికి చెట్లు విరిగిపడటం వల్ల బంగాల్లోని హావ్ డా జిల్లాలో ఒకరు, ఉత్తర 24 పరగణాల జిల్లాలో మరొకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా, బంగాల్లో కలిపి మొత్తం 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారులపై విరిగిపడ్ల చెట్లను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు.
తుపాను ప్రభావం
తుపాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్రతీర ప్రాంతాల్లో.. అల్లకల్లోలం చోటుచేసుకుంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో భీతావహ వాతావరణం ఏర్పడింది. పదుల సంఖ్యలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీట మునిగాయి. దిఘా బీచ్ వద్ద భారీ ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.
ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్సింగపుర్, కటక్, కేంద్రపారా, జజ్పుర్, గన్జమ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో భారీగా వర్షాపాతం నమోదైంది. ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అంతకుముందు, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బంగాల్లో 5 లక్షల మంది, ఒడిశాలో 1.58 లక్షల మందిని పునరావస కేంద్రాలకు పంపించారు.
గురువారం కూడా వర్షాలు
తూర్పు మిదనాపుర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో.. తుపాను తీవ్ర ప్రభావం చూపిందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. గంటకు 185 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు వెల్లడించారు. తుపాను కేంద్రకం 30 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ దాటిన తర్వాత(బుధవారం రాత్రికల్లా) తీవ్ర వాయుగుండంగా మారి పూర్తిగా బలహీనపడుతుందని చెప్పారు.