తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీడబ్ల్యూసీ: సారథిపై రాని స్పష్టత- రాత్రికి తేలే అవకాశం - కాంగ్రెస్​

సీడబ్ల్యూసీ లైవ్​: కాంగ్రెస్​కు కొత్త సారథి ఎవరో?

By

Published : Aug 10, 2019, 11:01 AM IST

Updated : Aug 10, 2019, 2:58 PM IST

14:48 August 10

రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం...

రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా రాజీనామా సమర్పించి చాలా కాలం గడుస్తున్నా... నూతన సారథిపై పార్టీ ఇంకా ఎటూ తేల్చలేదు. నేడు సుదీర్ఘంగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయంపై ఓ నిర్ణయం వస్తుందని అంతా ఊహించారు. అయితే ఈ భేటీలో స్పష్టత రాలేదు. రాత్రి 8.30 గంటలకు సీడబ్ల్యూసీ మరోమారు సమావేశం కానుంది. కొత్త అధ్యక్షుడిపై నేడు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరోసారి విజ్ఞప్తి...

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ మరోసారి చేసిన విజ్ఞప్తిని రాహుల్‌ గాంధీ తోసిపుచ్చినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. రాజ్యాంగ సంస్థలపై ప్రభుత్వం దాడి చేస్తున్న ఈ తరుణంలో రాహుల్‌ నాయకత్వం కావాలని  సీడబ్ల్యూసీ కోరగా.. రాహుల్​ తిరస్కరించారట. శ్రేణులతో కలిసి పోరాటం చేయడానికి రాహుల్​ సుముఖత చూపినట్లు సుర్జేవాలా తెలిపారు.

రాహుల్‌ రాజీనామా సీడబ్ల్యూసీ  పరిశీలనలోనే ఉందని సుర్జేవాలా స్పష్టం చేశారు. ఈ విషయంపై సాయంత్రానికి సీడబ్ల్యూసీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

5 బృందాలు ఏర్పాటు...

కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సీడబ్ల్యూసీ సభ్యులతో ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. రాహుల్‌గాంధీ వారసుణ్ని ఎంపిక చేసేందుకు ఇవాళ దిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన సీడబ్ల్యూసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ అనుబంధాన సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తీసుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. 

రేసులో...

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, మల్లికార్జున ఖర్గే పేర్లు ఉన్నట్లు సమాచారం. యువనేతల్లో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలెట్‌ పేర్లు వినిపిస్తున్నాయి.
 

13:37 August 10

మరోసారి భేటీ...

కాంగ్రెస్​ అధ్యక్షుడి ఎంపికపై సీడబ్ల్యూసీ నేడు మరోసారి భేటీ కానున్నట్లు పార్టీ నేత అధీర్​ రంజన్​ చౌదరీ తెలిపారు. నేడు రాత్రి 8.30 గంటలకు సమావేశం జరగనుంది. పార్టీ నూతన సారథి ఎవరనే విషయంపై 9 గంటలకు స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

13:23 August 10

ముగిసిన భేటీ...

సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. నూతన అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సింధియా, సచిన్​ పైలట్ల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ప్రియాంక గాంధీ పేరును కొంత మంది సీనియర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

12:41 August 10

వెళ్లిపోయిన సోనియా, రాహుల్...

సీడబ్ల్యూసీ భేటీ నుంచి సోనియా, రాహుల్ వెళ్లిపోయారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కమిటీల్లో తమ పేర్లు లేకపోవడం వల్లే వెళ్లిపోతున్నట్లు ఇరువురు తెలిపారు. కమిటీల్లో పేర్లు లేనప్పుడు ఉండటం సబబు కాదని అభిప్రాయపడ్డారు. రేపు తన పార్లమెంటు నియోజకవర్గం వయనాడ్ వెళుతున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు.

12:17 August 10

చర్చోపచర్చలు...

కాంగ్రెస్​ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ సీనియర్​ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. సారథిగా సీనియర్​ నాయకుణ్ని ఎన్నుకోవాలా లేక యువనేతకు అవకాశం ఇవ్వాలా అన్న విషయంపై నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

11:24 August 10

చర్చ మొదలు..

కాంగ్రెస్​ అధ్యక్షుడిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ భేటీ మొదలైంది. అనంతరం నేతలు 5 బృందాలుగా విడిపోయి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి నేతల అభిప్రాయం తీసుకొని పార్టీ అధ్యక్షుణ్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. 

11:11 August 10

చేరుకున్న రాహుల్​...

కాంగ్రెస్​ కార్యవర్గ సమావేశానికి రాహుల్​ గాంధీ సహా సీనియర్​ నేతలు రణీదీప్​ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్​ చేరుకున్నారు.

11:03 August 10

సోనియా రాక...

దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ జరగనుంది. ఇప్పటికే యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ కార్యాలయానికి చేరుకున్నారు.

10:51 August 10

కాసేపట్లో భేటీ...

కాంగ్రెస్​ నూతన అధ్యక్షుడు ఎవరన్న అంశంపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో.. కాసేపట్లో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే పార్టీ తదుపరి సారథి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే.. సీనియర్​ నేత ముకుల్​ వాస్నిక్​ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున్​ ఖర్గే సహా మరికొందరు యువనేతలూ పోటీలో ఉన్నట్లు సమాచారం.

Last Updated : Aug 10, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details