ఆసియా ఉత్తమ విద్యాలయాల జాబితాలో ఐఐఎస్సీకి 29వ ర్యాంకు ఏటా ప్రకటించే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఈ ఏడాది 49 వర్శిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో బెంగళూరు ఐఐఎస్సీ 29వ ర్యాంకులో నిలిచి భారత్ నుంచి ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఘనత సొంతం చేసుకుంది.
ఆసియా మొత్తం మీద 417 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ప్రకటించింది టైమ్స్. మొత్తం 103 విద్యా సంస్థలతో జపాన్ తొలి స్థానంలో నిలిచింది. చైనా, భారత్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. జాబితాలో భారత్ నుంచి 49 వర్శిటీలున్నాయి. గతేడాది 42 భారత విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి.
స్వయం ప్రతిపత్తి గల విద్యాసంస్థల ప్రమాణాల్లో కొన్ని హెచ్చుతగ్గుల మధ్య... భారత విశ్వవిద్యాలయాల పనితీరు మిశ్రమంగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
చైనా 'సింఘువా' అగ్రస్థానాన....
చైనాలోని సింఘవా యూనివర్సిటీ ఆసియాలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఏషియన్ వర్సిటీల ర్యాంకింగ్స్‌లో చైనా తొలి స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ రెండో ర్యాంకుకు పరిమితమైంది.
హాంగ్కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హాంగ్ కాంగ్ యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీ, చైనా సింఘువా, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలతో కలిసి టాప్-5లో నిలిచాయి.
టీహెచ్‌ఈ వెల్లడించిన జాబితాలో భారత్ నుంచి మిగతా విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ ఇండోర్ ఉమ్మడిగా 50, ఐఐటీ-బాంబే అండ్ రూర్కీ ఉమ్మడిగా 54వ స్థానంలో నిలిచాయి. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ 62, ఐఐటీ ఖరగ్పుర్ 76, ఐఐటీ కాన్పుర్ 82, ఐఐటీ దిల్లీ 91 ర్యాంకులతో టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి.
ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటీ హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రా, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలు చోటు సంపాదించాయి.
తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు..
విశ్వవిద్యాలయం | ర్యాంకు |
ఐఐటీ హైదరాబాద్ | 135 |
శ్రీ వెంకటేశ్వర | 201- 250 మధ్య |
ఆచార్య నాగార్జున | 251-300 మధ్య |
ఆంధ్రా యూనివర్సిటీ | 251-300 మధ్య |
ఉస్మానియా యూనివర్సిటీ | 251-300 మధ్య |
గీతం యూనివర్సిటీ | 401పైన |