తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్య'భారతంలో కొత్త సమీకరణలు.. కలహాల్లో కాంగ్రెస్​

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం కళ్లకు కడుతోంది. ఇటీవల యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో వైపు సింధియా భాజపాలో చేరడం వల్ల ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు.. ప్రస్తుత పరిస్థితి నిప్పులపై నడకలా మారింది. ఈ నేపథ్యంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తే తప్ప కమల్​నాథ్​ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కష్టతరమైన విషయం.. మరి ఈ పరిస్థితులపై విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Crisis in Madhya Pradesh politics .. Political analysts blaming internal riots in Congress
మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం... అంతర్గత కలహాలే కారణం!

By

Published : Mar 13, 2020, 8:23 AM IST

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కొంతకాలం క్రితం ప్రత్యర్థులు గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌కు 14 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులను తరలించగా, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఆ సవాలును ఎలాగోలా అధిగమించగలిగారు. తాజాగా యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. శరద్‌ పవార్‌లా ఏదైనా ఎత్తు వేస్తే తప్ప కమల్‌నాథ్‌ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం. 2018 డిసెంబరు శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా గెలిచినప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి పీఠం తననే వరిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేరకపోవడంతో అదను చూసి ఇప్పుడు దెబ్బకొట్టారు. మధ్యప్రదేశ్‌ శాసన సభలో మొత్తం 228 మంది సభ్యులు ఉండగా, సింధియా వర్గానికి చెందిన 22 మంది రాజీనామా చేయడంతో సభా బలం 206కి పడిపోయి, కమల్‌నాథ్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు 104 మంది సభ్యులు కావలసి ఉండగా, కాంగ్రెస్‌ పార్టీకి అంతా కలిపి 99 మంది సభ్యులే ఉన్నారు. దీంతో 107 మంది సభ్యులున్న భారతీయ జనతా పార్టీకి పరిస్థితి అనుకూలంగా మారింది. కమల్‌నాథ్‌ తనతో మిగిలిన ఎమ్మెల్యేలను ఒక రిసార్టులో దాచారు. సింధియా వర్గం ఇప్పటికే బెంగళూరులో మకాం పెట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలు కొందరిని హరియాణా, బెంగళూరు హోటళ్లకు తరలించినట్లు వార్తలు వచ్చాయి.

నేతల మధ్య విభేదాలతో..

జ్యోతిరాదిత్య సింధియా మొదటి నుంచీ రాహుల్‌ గాంధీకి సన్నిహిత నేస్తం, గట్టి మద్దతుదారు కూడా. అందువల్ల కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరేవారు. కానీ, కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ ద్వయం సింధియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆయనకు ముఖ్యమైన పదవి ఏదీ లభించకుండా జాగ్రత్తపడ్డారు. సింధియా దీన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే ట్విటర్‌లో కాంగ్రెస్‌తో ముడిపడిన తన అస్తిత్వానికి ముగింపు పలికారు. ఇది అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన తదుపరి అడుగు ఏమిటనే ఆసక్తి వెల్లడైనా, తన మనోగతాన్ని బయటపెట్టకుండా చాలా కాలం గుంభనంగా ఉన్నారు. 370వ రాజ్యాంగ అధికరణ రద్దుపై కాంగ్రెస్‌ అధికార వైఖరిని ట్విటర్‌లో తప్పు పట్టిన సింధియా, దిల్లీ అల్లర్లపై ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాజంలో చీలిక తెస్తోందని విమర్శించారు. ఈ ద్వంద్వ వైఖరి వల్ల ఆయన మనసులో ఏముందో ఇతరులు పసిగట్టలేకపోయినా- సింధియా సైద్ధాంతిక వైఖరి అవకాశవాదపూరితమని, ఆయన రాజకీయ వాస్తవాలను గుర్తెరిగి నడుచుకునే లౌక్యుడనీ ఇప్పుడు తేలిపోయింది. సింధియా బామ్మ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన మేనత్తలు ఇద్దరూ ఆ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు వెళదామని చూస్తున్నా, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన కోరికను మన్నించలేదు. ఇప్పుడు భాజపాలో చేరిన వెంటనే ఆయన ఆశ తీరింది. గుణ సీటు నుంచి లోక్‌సభకు పోటీ చేసిన సింధియా ఒక భాజపా అభ్యర్థి చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ భాజపా నాయకుడు గ్వాలియర్‌ రాజకుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి మరీ నెగ్గారు. అంతకుముందు వరసగా మూడు సార్లు గుణ నుంచి నెగ్గిన సింధియా, ఇక ఆ సీటు తనకెంత మాత్రం భద్రం కాదని గ్రహించి, భాజపాలో చేరడం ద్వారా తన పునాదిని పదిలం చేసుకోవాలనుకున్నారు.

మొదట్లో కొందరు శాసన సభ్యులు సింధియాతో జట్టు కట్టినప్పటికీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వారిని తనవైపు తిప్పుకోగలిగారు. రాజ్యసభ సీటు కోసం సింధియా తెచ్చిన ఒత్తిడిని నీరుగార్చడానికి ప్రియాంకా గాంధీకి సీటు ఇవ్వజూపారు. గ్వాలియర్‌ రాజవంశీకుడికన్నా తనకు నెహ్రూ వంశీకురాలే ఎక్కువని చాటుకున్నారు. గ్వాలియర్‌ రాజవంశంపై ఎన్నడూ అభిమానం చూపని దిగ్విజయ్‌ సింగ్‌ వత్తాసు కమల్‌నాథ్‌కు లభించింది. ఈ ఇద్దరి దెబ్బకు సింధియా కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పి భాజపాలో చేరిపోయారు. కర్ణాటకలో తన ఎమ్మెల్యేలు 17 మంది భాజపాలో చేరినా ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీకి మధ్యప్రదేశ్‌ పరిణామాలు గట్టి దెబ్బే. సైద్ధాంతిక పటిమ, నిబద్ధులైన శాసన సభ్యులు కాంగ్రెస్‌కు లోపించడం దీనికి ప్రధాన కారణం. కర్ణాటకలో ఎలాగైనా గెలవాలనే యావతో కాంగ్రెస్‌ గతంలో భాజపా, జనతాదళ్‌(ఎస్‌) నుంచి వచ్చినవారికి సీట్లు ఇచ్చింది. అలాంటివారు సందు దొరికితే చాలు భాజపాలోకి దూకేస్తారు. ఒకప్పుడు రాజకీయంగా అంటరాని పార్టీగా ముద్ర పడిన భాజపా నేడు ఏ పార్టీ నుంచైనా ఎమ్మెల్యేలను, నాయకులను ఆకర్షించగలగడం పెద్ద మలుపు.

భవితవ్యం ఏంటి?

గత లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ చుక్కాని లేని నావలా కొట్టుకుపోతోంది. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసినా, సోనియాను ఆశ్రయించుకుని ఉన్న ముఠా ఆయన ఆకాంక్షకు గండి కొట్టింది. సోనియా గాంధీ అస్వస్థురాలైనందున దిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. భాజపాను దెబ్బకొట్టాలనే కాంక్షతో కాంగ్రెస్‌ ఓట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీకి మళ్లడాన్ని అనుమతించారు. దీన్ని కొంతమంది ఉదారవాదులు ప్రశంసించినా కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీనపడటం తప్ప ఒరిగిందేమీ లేదు. దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు నాలుగు శాతానికి పడిపోయాయి. ఆమ్‌ ఆద్మీకి పరోక్ష మద్దతు ఇవ్వడం కాంగ్రెస్‌కు ఏ విధంగా లాభమో ఎవరికీ అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీకి బలమైన ప్రతిఘటనను నిర్మించడమెలా అన్నది కాంగ్రెస్‌కు తెలియకనే ఈ తిప్పలన్నీ. సీఏఏకి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వ్యక్తమైనా, దాన్ని ఒక ప్రభంజనంలా మలిచే నేర్పు, బలం కాంగ్రెస్‌కు లేకుండా పోయాయి. బహుశా స్వాతంత్య్రానంతరం ప్రజోద్యమాలను నిర్మించి నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్‌కు లేనందువల్ల ఈ మహదావకాశాన్ని జారవిడుచుకున్నట్లుంది. నాలుగేళ్ల తరవాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎలా సమాయత్తం కాగలదనేది కీలక ప్రశ్న.

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఢీకొనాలంటే కాంగ్రెస్‌కు సైద్ధాంతిక పటిమ, సమర్థుడైన నాయకుడు కావాలి. తదుపరి ఎన్నికల్లో గెలవాలంటే మైనారిటీలకు దూరంగా ఉండాలని రాహుల్‌ గాంధీకి కొందరు సలహాదారులు నూరిపోయగా, ఆయన ఆ పనే చేస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో పలు హిందూ ఆలయాలను సందర్శించారు కానీ, ముస్లిం ప్రతినిధులతో కనీసం ఒక్క సెల్ఫీ అయినా దిగలేదు. ఈ విధంగా కాంగ్రెస్‌కూ భాజపాకూ తేడా లేదని చాటుకున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై దేశమంతటా నిరసనలు రేగినా కాంగ్రెస్‌ ఏవో కంటితుడుపు మాటలతో సరిపెట్టిందే తప్ప మైనారిటీల కోసం పటిష్ఠ కార్యాచరణ చేపట్టలేదు. దిల్లీలో షాహిన్‌ బాగ్‌లో నిరసన తెలుపుతున్న ముస్లిం మహిళలను సోనియా కానీ, రాహుల్‌ కానీ పలకరించి, మద్దతు తెలపలేదు. ఆ పని చేస్తే సామాజిక మాధ్యమాల్లో భాజపా వర్గీయులు తమకు ముస్లిం మద్దతుదారులుగా ముద్రవేస్తారని వారు భయపడినట్లుంది. అలాగైతే కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అన్ని వర్గాలను ఎలా కలుపుకొనిపోగలుగుతుంది? సోనియా, రాహుల్‌ గాంధీలకు సలహాలిస్తున్న అవకాశవాద కాంగ్రెస్‌ నేతలు భాజపాతో సైద్ధాంతిక ప్రాతిపదికపై పోరాడే తెగువ కనబరచడం లేదు. కాంగ్రెస్‌ ఇదే పంథాలో ముందుకుసాగితే రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లలోని తమ ప్రభుత్వాలను సైతం భాజపాకు అప్పగించాల్సి రావచ్చు.

రాజ్యసభలో మెజారిటీయే ధ్యేయమా?

కోట్ల రూపాయలు పోసి తమ శాసన సభ్యులను ఫిరాయింపులకు దింపుతారని అన్ని పార్టీలూ భయపడుతున్నాయి. ఎమ్మెల్యేలు సంతలో సరకులా మారిపోవడం కొత్త కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు ఎన్నడో మట్టిలో కలిసిపోయాయి. అంతా డబ్బుమయమైపోయి నల్లధనంతో ప్రభుత్వాలను గద్దె దించడం, ఎక్కించడం సులువైంది. నిన్నమొన్నటి వరకు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజ్య సభలో మెజారిటీ సంపాదించడానికి ఏం చేయడానికైనా సిద్ధమైనట్లుంది. రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసైనా సరే- రాజ్యసభకు తన సభ్యులను ఎక్కువ సంఖ్యలో ఎన్నిక చేయించుకోవాలని భాజపా భీష్మించినట్లుంది. సింధియా తమ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు రాజ్యసభ సీటును కేటాయించడం దీనికి నిదర్శనం. పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ లభిస్తే కానీ, భాజపా కేంద్ర సర్కారు కీలకమైన బిల్లులను నెగ్గించుకోలేదు. అందుకే తనకున్న కలిమి బలిమితో ఇతర పార్టీల శాసన సభ్యులను తనవైపు తిప్పుకొనే కృషిని ముమ్మరం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో తాననుకున్నది నెరవేరితే తరవాత రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్రలలో కూడా ఇదే క్రీడ పునరావృతం చేయవచ్చు. మధ్యప్రదేశ్‌లో మొదట వేరే పార్టీలోకి మారదామనుకున్నా తరవాత కాంగ్రెస్‌ గూటికి తిరిగివచ్చిన ఒక శాసన సభ్యుడు, తాను కనుక ఫిరాయిస్తే 25 కోట్ల రూపాయలు ఇస్తామని అవతలి పార్టీవారు ఆశపెట్టినట్లు వెల్లడించారు. ఇంకొక శాసన సభ్యుడికైతే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తామన్నారట. ఆర్థికాభివృద్ధి మందగించిందని అందరూ బెంబేలెత్తుతున్న సమయంలో ఇంతింత భారీ మొత్తాలను ఇవ్వజూపడం వింత. ఎన్నికల్లో నెగ్గడానికి కోట్లు ఖర్చుపెట్టినవారు మళ్లీ ఆ సొమ్మును ఎలాగైనా సంపాదించాలనుకొంటారు. అలాంటివారు ధన ప్రలోభాలకు లొంగడం సహజం. కొంతమంది యువతరం నేతలు పార్టీలో తమ ఎదుగుదలకు అవకాశాలు లభించడం లేదని కలత చెందుతుంటారు. వీరికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇస్తామంటే పార్టీ మారడానికి సిద్ధపడతారు.

- సంజయ్ కపూర్​(రచయిత- సీనియర్​ పాత్రికేయులు)

ABOUT THE AUTHOR

...view details