కరోనా సోకిన వారికి సేవలందిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకూ ఈ వైరస్ ముప్పు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారమెడిక్ సిబ్బంది కలిపి మొత్తం 548 మందికి ఈ మహమ్మారి సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే.. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డ్ బాయ్స్, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, ల్యాబ్ సిబ్బంది, ప్యూన్లు, లాండ్రీ, కిచెన్ సిబ్బందిని కలపలేదని తెలిపారు అధికారులు. కరోనా సోకిన వైద్య సిబ్బందికి ఎక్కడి నుంచి వైరస్ సంక్రమించిందనే విషయం నిర్ధరించలేదని చెప్పారు.
కేసుల సంక్రమణపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. అందువల్ల.. పని ప్రదేశంలో ఎంత మందికి వైరస్ సోకింది, ఎంత మందికి ఇతర మార్గాల ద్వారా సంక్రమించిందనే స్పష్టమైన వివరాలు లేవు. కొంత మంది వైద్యులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఎంత మంది అనే సంఖ్య ప్రస్తుతానికి తెలియదు.