'ప్రస్తుతం కేసుల రెట్టింపు సమయం 15.4 రోజులు' - Health Ministry
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ సమయం 13.3 రోజుల నుంచి 15.4 రోజులకు పెరిగిందని పేర్కొంది.
15.4 రోజులకు పెరిగిన కేసుల రెట్టింపు సమయం
By
Published : May 30, 2020, 10:51 PM IST
దేశంలో కరోనా కేసులు రెట్టింపు అవటానికి పట్టే సమయం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన మూడు రోజుల గణాంకాలను పరిశీలించినప్పుడు 13.3 రోజుల నుంచి 15.4కు ఈ సమయం పెరిగినట్లు వెల్లడించింది.
"గడిచిన 24 గంటల్లో మొత్తం 11,264 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో రికవరీ కావటం ఇదే తొలిసారి. దీంతో దేశవ్యాప్తంగా 42.89గా ఉన్న రికవరీ రేటు.. 4.51 శాతం పెరిగి అమాంతం 47.40 శాతానికి చేరింది."
-ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన
మే 29 వరకు 2.55 శాతం క్రియాశీలక కేసులు ఐసీయూలో ఉండగా.. 0.48 శాతం మంది వెంటిలేటర్లపై, మరో 1.96 శాతం మంది ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
పరీక్షల సామర్థ్యం పెంచేందుకు మొత్తం 662 ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబోరేటరీలకు అనుమతినిచ్చినట్లు తెలిపింది. దీని ఫలితంగా ఇప్పటి వరకు 36,12,242 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.