తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు - lockdown

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. నెలక్రితం మార్చి 22న 360గా ఉన్న పాజిటివ్​ కేసులు.. నేడు 20 వేల 471కి చేరాయి. అంటే నెలరోజుల్లోనే 20 వేల కేసులు పుట్టుకొచ్చాయి. దేశవ్యాప్తంగా 429 జిల్లాలకు కరోనా వ్యాపించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో నాలుగో వంతు మంది మహారాష్ట్రలోనే ఉన్నారు.

COVID-19: Confirmed cases cross 21,000;
నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Apr 23, 2020, 5:26 AM IST

కరోనా పాజిటివ్‌ కేసులు భారత్​లో 20వేలు దాటాయి. సరిగ్గా 8 రోజుల్లో కేసులు 10వేల నుంచి రెట్టింపు అయ్యాయి. ఈ జాబితాలో ప్రపంచంలో 17వ స్థానానికి భారత్‌ చేరింది. నెలరోజుల క్రితం (మార్చి 22న) జనతా కర్ఫ్యూ ద్వారా పౌర జీవన దిగ్బంధం మొదలైంది. ఆరోజు నాటికి 360 ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య బుధవారానికి 20,471కి చేరింది. అంటే 5,686% వృద్ధి నమోదైంది.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 429 జిల్లాలకు ఈ మహమ్మారి విస్తరించింది. దేశంలో 58% వంతు భూభాగానికి దీని ఆనవాళ్లు పాకాయి. ఇందులో 25% కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.21% (19,083 కేసులు) కేసులు కేవలం 12 రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటివరకూ 3,960 మంది (19.44%) కోలుకోగా, 652 (3.18%) మంది కన్నుమూశారు. గత 24 గంటల్లోనే 1,486 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవధిలో 700 మంది కోలుకోగా 49 మంది మరణించారు. 24 గంటల్లో 700 మంది కోలుకోవడం ఇదే తొలిసారి.

తగ్గుతున్న రేటు...

లాక్‌డౌన్‌, భౌతిక దూరం, ప్రభుత్వపరమైన ఆంక్షల వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల వృద్ధిరేటు తగ్గుతోంది. జనతా కర్ఫ్యూ విధించిన నాటినుంచి నెల రోజుల్లో తొలివారంలో కేసుల్లో సగటున 18.45% వృద్ధి నమోదైంది. రెండోవారంలో 19.18%కి పెరిగింది. ఆ తర్వాతి వారాల్లో వరుసగా అది 13.78%, 10.16%కి తగ్గుతూ వచ్చింది. గత నాలుగు రోజుల్లో చూస్తే సగటున 8.94% వృద్ధి కనిపించింది.

కేసుల సంఖ్య వెయ్యి నుంచి 2వేలకు, అక్కడినుంచి 4వేలకు చేరడానికి నాలుగురోజుల చొప్పున పట్టింది. 5వేల నుంచి రెట్టింపై 10వేలకు చేరడానికి ఆరు రోజులు తీసుకుంది. 10 నుంచి 20వేలకు చేరడానికి 8 రోజులు పట్టింది. కేసుల రెట్టింపునకు పట్టే గడువు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో కేసుల వ్యాప్తి కొంత అదుపులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.

కేసుల్లో పెరుగుదల ఇలా...

ఆ ప్రాంతాల్లో నో కరోనా..

ఇప్పటి వరకు దేశంలో 4,47,812 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 4.23% మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 20న 1540 కొత్త కేసులు రావడంతో కేసుల సంఖ్య పరంగా అది తొలిస్థానంలో నిలిచింది. మంగళ-బుధవారాల మధ్య 1486 కేసులు రావడం రెండో అతిపెద్ద పెరుగుదల. దేశంలో వందకు పైబడి పాజిటివ్‌ కేసులు 27 జిల్లాల్లో ఉన్నాయి. లక్షద్వీప్‌, సిక్కిం, నాగాలాండ్‌, దాద్రానాగర్‌ హవేలీ దమణ్‌ దీవులు కరోనా సోకని ప్రాంతాలుగా మిగిలాయి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్యపై ఇప్పటికీ విమర్శలు రేగుతున్నాయి. వీటి సంఖ్య పెంచితే తప్ప ప్రయోజనం ఉండదని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

75 శాతం కోలుకున్న రోగులు...

కరోనా కట్టడిలో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిచింది. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిలో దేశంలో ఒకటో స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రం ఇప్పుడు పదో స్థానానికి పరిమితమైంది. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 75% మంది రోగులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇక్కడ మరణాల నిష్పత్తి 0.70 శాతానికే పరిమితం కావడం విశేషం.

ధారవిలో దారుణ పరిస్థితులు...

మహారాష్ట్రలోనే 5221 కేసులున్నాయి. ముంబయిలోని ధారవి మురికివాడలో మరో 9 మంది కన్నుమూశారు. మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ముంబయిలో కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే నివాస భవనంలో సెక్యూరిటీ గార్డు ఒకరు కరోనా బారిన పడ్డారు. గుజరాత్‌లో మరో 229 మందికి కరోనా సోకింది. ఒక్క అహ్మదాబాద్‌ జిల్లాలో 1501 కేసులున్నాయి.

అనుమతిస్తాం...

ఉత్తర్‌ప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలవారిని ఆయా రాష్ట్రాలు తీసుకువెళ్లదలచుకుంటే అనుమతించి, పూర్తిగా సహకరిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details