కరోనా సంక్షోభం మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తోంది. అనేక పనులు స్తంభించిపోయాయి. ఆరోగ్యపరమైన అంశాలకూ మినహాయింపు లేకుండా పోయింది. రక్త హీనత వంటి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి పెను విపత్తుగా మారింది. అత్యవసర వైద్య సాయం అందక.. వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది.
ఇలాంటి పరిస్థితే గురుగ్రామ్ నివాసి సోనియా ఘక్కడ్కు ఎదురైంది. ఆమె భర్త లుకేమియా (బ్లడ్ కేన్సర్)తో బాధపడుతున్నాడు. తరుచూ బోన్ మ్యారో (ఎముక మజ్జ) మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే లాక్డౌన్ వల్ల అది చేయించడం ఆమెకు సాధ్యం కావడం లేదు.
"2 నెలల క్రితం నా భర్తకు బోన్ మ్యారో డయాగ్నైజ్ చేశాం. ఇది తరచూ చేస్తేనే ఆయన బతికే అవకాశం ఉంటుంది. ఆరోగ్య శాఖ నుంచి రక్త మూలకణాల రవాణా కోసం అనుమతి తీసుకున్నాం. కానీ అవి అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం దొరకడం కష్టంగా ఉంది."
- సోనియా ఘక్కడ్
రక్త సమస్యలతో బాధపడేవారికి మూల కణాల మార్పిడితోనే చికిత్స చేస్తారు. అయితే వ్యక్తుల రక్తం గ్రూపుతో సరిపోయే దాతలు దొరికేందుకు నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పడుతుందని హెమటాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు పరిమిత సమయమే ఉంటుందన్నారు.
20 శాతానికి పతనం..
లాక్డౌన్ నేపథ్యంలో మార్పిడి ప్రక్రియ 20 శాతానికి పడిపోయంది. చాలా ఆసుపత్రులు వీటిని వాయిదా వేస్తున్నాయి. అదనపు కీమోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముంబయికి చెందిన ధనిశ్కు మార్చి చివరి వారంలో మూల కణ చికిత్స చేయాల్సి ఉంది. రవాణా సదుపాయం లేని కారణంగా వైద్యులు వాయిదా వేశారని చెబుతున్నాడు ధనిశ్.
"ప్రస్తుతం నేను కీమోథెరపీ సెషన్పైనే ఆధారపడ్డాను. ఇది నా డబ్బుతో పాటు నన్ను బలహీనుడిని చేస్తోంది. సమయం మించిపోకముందే పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా."
- ధనిశ్, లుకేమియా వ్యాధిగ్రస్తుడు
పరిమిత సంఖ్యలో..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రులు కొంత మందిని ఎంపిక చేసుకుని చికిత్స చేస్తున్నాయని ప్రఖ్యాత హెమటాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మమ్మెన్ ఛాందీ తెలిపారు.