తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేలమట్టం కావాల్సింది భవనం కాదు... అవినీతి

కేరళలో మరదు గ్రామం అంటే ప్రస్తుతం తెలియని వారుండరూ. తీరప్రాంత క్రమబద్ధీకరణ (సీఆర్‌జెడ్‌) నిబంధనల్ని ఉల్లంఘింస్తూ పదహారంతస్తుల నాలుగు అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వటం రాజకీయంగా దూమారం జరగటం వలన ఆ గ్రామం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆ నిర్మాణాన్ని అక్రమ కట్టడంగా భావించి నేల మట్టానికి ముహూర్తం ఖరారు చేసింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..!

అవినీతి నేలమట్టం కానిదే...

By

Published : Sep 30, 2019, 3:03 PM IST

Updated : Oct 2, 2019, 2:25 PM IST

‘పర్యావరణ విధ్వంసం కారణంగా సంభవించిన వరదల్లో ఎంతమంది మరణించారో తెలుసా మీకు? కొంపాగోడు కోల్పోయిన అభాగ్యులకు మీరు ఎన్ని ఇళ్ళు కట్టించి ఇచ్చారు? ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి’- కొన్నాళ్ల క్రితం కేరళ ప్రధాన కార్యదర్శిపై సుప్రీంకోర్టు వ్యక్తీకరించిన ధర్మాగ్రహమిది. తీరప్రాంత క్రమబద్ధీకరణ (సీఆర్‌జెడ్‌) నిబంధనల్ని ఉల్లంఘించి కొచ్చి సమీపంలోని మరదు గ్రామ పంచాయతీలో నిర్మించిన నివాసగృహ సముదాయాన్ని కూలగొట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు, తాజాగా అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరదు వివాదానికి, సీఆర్‌జెడ్‌ చట్ట ఉల్లంఘనల నేపథ్యంలో జాతీయ ప్రాధాన్యం ఉంది.

2006లో సీపీఐ(ఎం) సారథ్యంలోని మరదు గ్రామ పంచాయతీ- జలవనరుకు అభిముఖంగా 68 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో 343 ఫ్లాట్ల నిర్మాణానికి అయిదు సంస్థలను అనుమతించింది. కేరళ తీరప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు తొమ్మిది నెలల తరవాత గ్రామ పంచాయతీయే బిల్డర్లకు నోటీసులు జారీచేసింది. సీఆర్‌జెడ్‌ మూడో కేటగిరీలో ఉన్న ప్రాంతంలో రెండొందల మీటర్లలోపు ఏ నిర్మాణమూ చేపట్టరాదని, అలాంటి నిర్మాణాల విషయంలో గ్రామ పంచాయతీలు ముందుగా తన సమ్మతి పొందాలని ప్రాధికార సంస్థ వాదిస్తోంది.

కేరళ హైకోర్టు నుంచి బిల్డర్లు 2006లో తాత్కాలిక ‘స్టే’ ఉత్తర్వులు తెచ్చుకొని అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు పూర్తిచేయగా, 2016లో ప్రాధికార సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాదాన్ని సాంకేతిక కమిటీ ద్వారా అధ్యయనం చేయించిన న్యాయపాలిక, దాని నివేదిక అనుసారం పంచాయతీ ఇచ్చిన అనుమతి అక్రమమంటూ, ప్రకృతి ఉత్పాతాల రీత్యా నియమ ఉల్లంఘనల్ని తేలిగ్గా తోసిపుచ్చలేమంటూ పదహారంతస్తుల నాలుగు అపార్ట్‌మెంట్ల నేలమట్టానికి ముహూర్త నిర్ణయం చేసింది. తమ తప్పులేకున్నా సొంత గృహాన్ని కోల్పోతున్న అభాగ్యుల ఆక్రందన ఎవరికీ పట్టడం లేదు. తలో పాతిక లక్షల రూపాయల తాత్కాలిక పరిహారంతో వారి వేదనా తీరేది కాదు!

మరదు పంచాయతీ 2010లో పురపాలక సంస్థగా ఎదగడంతోపాటు, తీరప్రాంత కేటగిరీల్లోనూ మార్పులు వచ్చాయి. నిర్మాణ అనుమతులు పొందిన సమయంలో అది అక్రమమేమోగాని, నిబంధనల మార్పు దరిమిలా తమ నిర్మాణాలు సక్రమమేనని సాంకేతిక కమిటీ ఎదుట బిల్డర్లు చేసిన వాదన వీగిపోయింది. పర్యావరణ పరిరక్షణే ప్రధానమంటూ నిర్మాణాల కూల్చివేతకు సుప్రీం కొరడా ఝళిపిస్తుంటే, వాటిని అలా నేలమట్టం చేస్తేనే పర్యావరణ విధ్వంసం సాగుతుందన్న మొత్తుకోళ్లూ దీర్ఘశ్రుతిలో వినిపిస్తున్నాయి.

నిర్మాణదారులు, వారికి సహకరించిన అధికారుల నుంచే నష్టపరిహారం రాబట్టాలని స్పష్టీకరిస్తున్న సుప్రీంకోర్టు- సీఆర్‌జెడ్‌ నిబంధనల ఉల్లంఘన సమస్య లోతుపాతుల్ని సరిగ్గా తర్కించినట్లు లేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో రూపుదాల్చగా అయిదేళ్ల పిమ్మట చట్ట నిబంధనల్ని క్రోడీకరించారు. ఈ 28 సంవత్సరాల్లో 34 సవరణలు చేసి, రెండుసార్లు నిబంధనల్నే తిరగరాయడంతో భారతావని చరిత్రలోనే అత్యధిక మార్పులకు లోనైన చట్టంగా అది చరిత్ర సృష్టించింది. సముద్ర తీరప్రాంతాల్లో అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థల సంరక్షణ లక్ష్యంగా తీరంలో మానవ, పారిశ్రామిక కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించడానికే సీఆర్‌జెడ్‌ నిబంధనలున్నాయి.

మారుతున్న కాలమాన పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలు, దేశ రక్షణ ఇంధన అవసరాల రీత్యా 2011లోను, తాజాగా 2018 డిసెంబరులోను కొత్త నిబంధనావళి వెలుగుచూసింది. ఎన్ని ని‘బంధనాల్ని’ అయినా అవినీతి కత్తితో తెగతెంచి, అక్రమ నిర్మాణాలకు అనుమతుల పందేరంతో కాసుల పంట పండించుకొనే అధికార యంత్రాంగం అన్నిచోట్లా సువ్యవస్థితమైన దేశం మనది. అధికార అవినీతి హోమంలో సామాన్య నడిమి తరగతి జనావళి ప్రయోజనాలే సమిధలైపోతున్న తీరే గుండెల్ని మెలిపెడుతోంది!

ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా భూ వినియోగ కేటగిరీల్నిబట్టి రూపొందించే నిబంధనలన్నీ సూటిగా సరళంగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు పౌరులందరికీ అందుబాటులో అర్థమయ్యేరీతిలో అవి అక్కరకొచ్చే వాతావరణం నెలకొనాలి. అధికారుల స్థాయిలో దుర్విచక్షణలు, ప్రభుత్వాల పరంగా క్రమబద్ధీకరణ మేళాలు అవినీతికి ఎరువవుతున్నాయి. కేరళ తీరప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థ- ప్రస్తుతం కూల్చివేతకు సిద్ధమవుతున్నవి గాక మరో 61 నిర్మాణాల నియమ ఉల్లంఘనల జాబితాను సిద్ధం చేసింది. మూన్నాళ్ల క్రితం భేటీ అయిన మంత్రివర్గం ఎకాయెకి 1800 అక్రమ నిర్మాణాల్నీ ఉపేక్షించే వీల్లేదంటోంది.

మరోవంక, 2013లో అలప్పుజలో రూ.350 కోట్ల రిసార్ట్‌ను కూల్చివేయాలన్న హైకోర్టు ఆదేశాల్ని సుప్రీంకోర్టు నిలిపేయడం, మరో కేసులో కోటి రూపాయల జరిమానాతో సరిపుచ్చడం వంటివి- నేడు సొంతిల్లు కోల్పోనున్నవారిలో ఆవేదన పెంచుతున్నాయి. ముంబయి బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం నలుగుర్ని పొట్టనపెట్టుకొన్న దారుణాన్ని ప్రస్తావిస్తూ, బిల్డర్లు అనుమతుల కోసం చకోర పక్షులవుతుంటే, అక్రమ నిర్మాణాల్లో అభాగ్యులు కడతేరిపోతున్నారని నిరుడు ఆగస్టు చివరివారంలో న్యాయపాలిక వ్యాఖ్యానించింది.

దేశ రాజధానిలోని అక్రమ నిర్మాణాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు- తక్కినచోట్లా పరిస్థితి దారుణంగానే ఉందని సరిగ్గానే గుర్తించింది. పౌరుల గౌరవప్రద జీవనానికే కాదు అసలు వారి జీవన హక్కునే తొక్కిపడుతూ బహుళ అంతస్తులుగా పడగెత్తిన అవినీతికి ప్రభుత్వాలే జవాబుదారీ. అక్రమ నిర్మాణాల నేలమట్టంతో ఆశల సౌధం కుప్పకూలి రోడ్డునపడే అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యతతో ముందుకురావాలి!

ఇదీ చూడండి:బిహార్​లో వరద బీభత్సం- ఎటుచూసినా నీరే

Last Updated : Oct 2, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details