కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డెకు సిఫార్సు చేయాలని నిర్ణయించింది న్యాయవాదుల సమాఖ్య. శనివారం జరిగిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23 నుంచి నాలుగు వారాల పాటు సెలవులను ప్రకటించాలని కోరనున్నట్లు వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సూచనల మేరకు ఈ సెలవులను కోరినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే పరిస్థితిని పరిశీలించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈసీ నిర్ణయించినట్లు తెలిపారు. సేవలను అందించడానికి ఏ సమయంలోనైనా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ఈసీ తీర్మానించింది.