కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీల ఆరోగ్య దృష్ట్యా వారి సంఖ్యను తగ్గించేందుకు నడుం బిగించింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు జారీ చేసింది. ఖైదీల మధ్య సామాజిక దూరాన్ని పెంచేందుకు కొందరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై పంపాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
పెరోల్‌పై బయటకు పంపే ఖైదీలను గుర్తించేందుకు రాష్ట్రాల పరిధిలో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడిన వారికి పెరోల్ ఇవ్వవచ్చని తెలిపింది. పెరోల్‌పై ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర న్యాయ సేవ అథారిటీతో కలిసి ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
"ప్రతి రాష్ట్రంలో హోంశాఖ కార్యదర్శి, ఛైర్మన్, రాష్ట్ర న్యాయ సేవ అథారిటీతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై ఏఏ ఖైదీలను విడుదల చేయాలనేది నిర్ణయిస్తారు."