తెలంగాణ

telangana

'సానుకూల ధోరణితో వైరస్​ను పారదోలుదాం'

By

Published : Mar 24, 2020, 5:50 PM IST

Updated : Mar 24, 2020, 8:56 PM IST

సానుకూల ధోరణితో వ్యవహరించి కరోనా వైరస్​ను పారదోలాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎలక్ట్రానిక్ మీడియా అధినేతలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఆయన.. నేడు దేశంలోని పత్రికల అధినేతలతో వైరస్​పై చర్చించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుతో కరోనా నియంత్రణపై సంప్రదింపులు జరిపారు. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానికి పలు సూచనలు చేశారు రామోజీరావు.

modi with Ramojirao
మోదీతో రామోజీరావు

మీడియా సంస్థల అధినేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

కరోనా వ్యాప్తి నిరోధకానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... వైరస్‌ కట్టడిపై మీడియా సంస్థల అధినేతలతో చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం చర్చించిన ప్రధాని.. ఇవాళ దేశంలోని వివిధ పత్రికల అధినేతలతో సంప్రదింపులు జరిపారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు, భయాలను పత్రికల ద్వారా సానుకూల ధోరణిలో పోగొట్టాలని ప్రధాని సూచించారు. పత్రికల ద్వారా కరోనాపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. వైరస్ నియంత్రణకు పాత్రికేయ సంస్థల అధినేతల సలహాలు, అభిప్రాయాలను సైతం ప్రధాని తీసుకున్నారు. మీడియా సంస్థలు అందించే సమాచారం ప్రభుత్వానికి చాలా కీలకమని మోదీ చెప్పారు. శాస్త్రీయమైన నివేదికలనే ప్రజలకు తెలియజేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి వివరించారు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

"మొదటిది భారత్‌లో 65 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారని మీకు తెలుసు. ఈ మహమ్మారి నుంచి మొదట మనం ఈ గ్రామాలకు రక్షణ కల్పించాలనేది నా భావన. ప్రతి రోజూ ప్రజలకు మీడియా తమ బాధ్యతగా సమాచారాన్ని చేరవేస్తుంది. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం 65 శాతం మంది ప్రజలకు రక్షణ కల్పించగలిగితే దేశ ఆరోగ్యరంగంపై భారం తగ్గించవచ్చు. రెండో విజ్ఞప్తి ఏమిటంటే మీరు భారత్‌లో తయారీ నినాదాన్ని ఇచ్చారు. దేశంలో ఫార్మసీ పరిశ్రమ పటిష్ఠంగా ఉండడం మనం గర్వపడాల్సిన విషయం. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సహా అనేక ఔషధాల తయారీలో మన పరిశ్రమ ఎంతో పురోగతి సాధించింది. నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఫార్మసీ పరిశ్రమను ఆహ్వానించి వారి సహాయం తీసుకోవాలి. మీరు వారికి అవసరమైన మద్దతు ఇస్తే ఫార్మసీ రంగం వెంటనే పరిశోధనలు జరిపి కరోనా నిరోధానికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు, ఔషధాలు తయారు చేయగలుగుతారు."

-రామోజీరావు, ఈనాడు వ్యవస్థాపకులు

రామోజీరావు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు ప్రధాని. ఫార్మసీ రంగంలో చేసిన కృషిని వివరించారు.

"రామోజీ.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మీకు చెప్పేది ఏమిటంటే ఫార్మసీ రంగానికి చెందిన వ్యక్తులు, మెడికల్ పరికరాలు తయారు చేసే వారితో విస్తృతంగా చర్చించి వారితో కలిసి ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రణాళికలను మన ప్రైవేటు రంగం కూడా పాటిస్తుందనే విశ్వాసం మాకు ఉంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు రామోజీరావు. వైరస్​పై ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇటలీ అనుభవాల నుంచి నేర్చుకోవాలని గుర్తుచేశారు. ఇటలీ అనుభవాలను నిపుణుల ద్వారా అధ్యయనం చేయించి తదుపరి కార్యాచరణను సిద్ధం చేయాలని ప్రధానికి సూచించారు.

"మీరు చేసినదానికి ఎంతో సంతోషం. నా మూడో సూచన ఏమిటంటే ఈ కేసులో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి చైనా నుంచి, రెండోది ఇటలీ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. వారి అనుభవాలు మనకు బాగా ఉపయోగపడవచ్చు. ప్రభుత్వం నుంచి కొందరు నిపుణులు ఆ దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో అధ్యయనం చేయాలి. వారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో గమనించాలి. తద్వారా దేశంలో విస్తరిస్తున్న ఈ మహమ్మారి కట్టడికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు."

-రామోజీరావు, ఈనాడు వ‌్యవస్థాపకులు

ఇదీ చూడండి:దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్యశాఖ మీడియా సమావేశం

Last Updated : Mar 24, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details