తెలంగాణ

telangana

By

Published : May 16, 2020, 9:04 AM IST

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: 5.80 లక్షల శస్త్రచికిత్సలు వాయిదా!

కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న చాలా శస్త్రచికిత్సలు (ఆపరేషన్స్) వాయిదా పడుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ మూడు నెలల్లో దేశంలో 5.80 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు రద్దు లేదా వాయిదా పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

IMPACT OF COVID- 19 ON SUGERIES
కరోనా ఎఫెక్ట్​: శస్త్రచికిత్సలు వాయిదా

శస్త్రచికిత్సలపై కొవిడ్‌ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనమొకటి గుర్తించింది. భారత్‌లో ముందుగా షెడ్యూలు చేసుకున్న 5.80 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు నెలల వ్యవధిలో రద్దు లేదా వాయిదా పడే అవకాశాలున్నాయని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య దాదాపు 2.84 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఫలితంగా రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా సోకకుండా...

120 దేశాలకు చెందిన ఐదు వేలమందికిపైగా శస్త్రచికిత్స నిపుణులతో కూడిన 'కొవిడ్‌సర్జ్‌ కొలాబొరేటివ్‌'.. భారత్‌, బ్రిటన్‌, అమెరికా, ఇటలీ, మెక్సికో సహా 71 దేశాల్లో పరిస్థితులను ఈ అధ్యయనంలో భాగంగా విశ్లేషించింది. ముందుగా షెడ్యూల్‌ చేసుకున్న, అత్యవసరం కాని శస్త్రచికిత్సలను కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులు వాయిదా వేశాయి. మరికొన్నింటిని రద్దు చేశాయి. ఆస్పత్రుల్లో రోగులకు కరోనా సోకకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండే 12 వారాల వ్యవధిలో 72.3% శస్త్రచికిత్సలు రద్దవుతాయని అంచనా. వాటిలో అత్యధికం క్యాన్సరేతర రోగులవేనని నివేదిక వెల్లడించింది. 63 లక్షల శస్త్రచికిత్సలు ఆర్థోపెడిక్‌కు సంబంధించినవని పేర్కొంది.

భారత్‌లో 5,84,737 మంది రోగులపై ఈ వాయిదాల ప్రభావం పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల క్యాన్సర్‌ శస్త్రచికిత్సలపైనా మహమ్మారి ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఆస్పత్రులు, రోగులు, సమాజంపై భారాన్ని తగ్గించేందుకు వాటి వాయిదా అవసరమేనని.. అయితే- శస్త్రచికిత్సలు ఆలస్యమవడంతో పలువురు రోగుల ఆరోగ్యం క్షీణించే అవకాశముందని పేర్కొంది. కొంతమందికి మృత్యుముప్పూ పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:కరోనా రోగి ప్రాణాలు కాపాడేందుకు ఊపిరితిత్తుల మార్పిడి!

ABOUT THE AUTHOR

...view details